Mahanati Savithri Biography
మహానటి సావిత్రి జీవిత చరిత్ర
కొమ్మారెడ్డి సావిత్రి (డిసెంబరు 6, 1935 - 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ
సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా
కీర్తింపబడింది.
గుంటూరు జిల్లా చిర్రావూరు
గ్రామంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న ఆమెను
పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత
నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే ప్రముఖ హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల
మీదుగా బహుమానం కూడా అందుకుంది.
తర్వాత సినిమాల్లో నటించడం కోసం
మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా
ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు
పొందింది.
తమిళ నటుడు జెమిని గణేశన్ ను
పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ
చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు.
కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.
తొలి జీవితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1935 న నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి చేరారు. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది.
చలనచిత్ర ప్రవేశానికి ముందు
సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్నసమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది.
చలనచిత్ర జీవితం
పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం
వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది.
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక
ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి
దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె
సినీ జీవితంలో ఒక మలుపు.
తన నటనా ప్రతిభను
నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం
రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది.
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో
మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర
కథానాయికగా స్థిరపడింది.
1957 లో వచ్చిన తెలుగు
చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా
వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను
తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.
ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి
పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది.
1968లో చిన్నారి పాపలు సినిమాకు
దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే
తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత
సంతరించుకున్నది .
1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులుకోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై 1981 డిసెంబర్ 26 న మరణించింది.
ఇతర విశేషాలు
అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
అపజయాలు
మహానటి సావిత్రి జీవితంలో
సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం
వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది
పాలుపంచుకున్నారు. వీరి అభిప్రాయ బేధాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె
సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది.తెలుగులో అమోఘ
విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్ తో
నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థికపతనానికి దారితీసింది.
ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్‌కు నివాసం మారిన తరువాత
ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.
మహానటి చిత్రం
సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో "మహానటి" అనే సినిమా రూపొందించారు. ఈ చిత్రమునకు ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది.
"మహానటి" చిత్రం
తరువాత ఆ మహానటి జీవితంలోని పలు ఘట్టాల గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ
నేపథ్యంలో సావిత్రి లోని గుణగణాల గురించి ఆ మహానటి గురించి తమకు తెలిసిన విషయాలను
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలో సావిత్రి గారి దాతృత్వం గురించి
తనకు తెలిసిన విషయాన్ని ఒ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ wiral అనే
ఫేస్ బుక్ అకౌంట్ లో వివరించారు. సావిత్రి అభిమాని అయిన ఆయన ఆనాటి ఘటనను తన మనసులో
పదిలంగా నిక్షిప్తం చేసుకోవడంతో పాటు ఇప్పుడు సావిత్రి దాతృత్వం గురించి చర్చ
జరుగుతున్న ఈ తరుణంలో ఆ నాటి జ్ఞాపకాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అందుకే
ఆయన రాసిన పోస్ట్ ను యథాతథంగా ఇక్కడ మీకు అందిస్తున్నాను.
నేను రేపల్లె స్టేట్ బ్యాంకు లో 1972 నుండీ 1984 వరకు పని చేసాను.అప్పుడు Correspondent S S G H School వడ్డివారిపాలెం పేర మా బ్యాంకు లో Current Account ఉండేది. S S G H School అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం. సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల సౌకర్యార్ధం స్థాపించిన స్కూల్ అది. కేవలం సావిత్రి గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది. ఆ తర్వాత ప్రభుత్వము వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా ప్రభుత్వము వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది.గవర్నమెంటు గ్రాంటు లేకపోతే ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు.
వారి స్కూలు తరఫున ఉద్యోగి తమ
స్టాఫ్ జీతములందరి చెక్కు మార్చుకొనడానికి మా బ్యాంకుకు వచ్చేవారు . సావిత్రి గారి
మీద ఉన్న అభిమానముతో ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని . సుమారు అయిదు నెలలు మా
బ్యాంకు తో పని పడక ఆ స్కూలు వారెవరూ మా బ్యాంకు కు రాలేదు. ఒక రోజు నేను మా
బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు ఆ స్కూలు
ఉద్యోగి సావిత్రి గారి సంతకముతో ఉన్న రూ.104000 /_ రూపాయల
మద్రాసు ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి
తీసుకుని వచ్చారు.1975 ప్రాంతంలో రూ. 104000 /- అంటే ఈ రోజుల్లో షుమారు రూ. 40 లక్షలు పైనే .
మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు బిల్లు జమ చేయబడ్డాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు
. అదీ Regular గా జరిగే Procedure.
దానికి భిన్నంగా సావిత్రి గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను " ఇదేమిటి సర్ !! రొటిన్ కు భిన్నంగా సావిత్రి గారి సంతకముతో చెక్కు తెచ్చారు ? " అని అడిగాను. దానికి అతను " ఈ మధ్య సావిత్రి గారు స్కూలు ఎలా నడుస్తోంది ? అని మా Corrspondent గారిని ఫోనులో అడిగారు సర్ . దానికి మా Correspondent గారు అయిదు నెలల నుండీ ప్రభుత్వ గ్రాంటు లేక పని చేసే ఉపాధ్యాయులకు , సిబ్బందికి జీతాలు లేవమ్మా తిండికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పారు.
ఆ విషయం విన్న సావిత్రి గారు Correspondent గారిని
వెంటనే మద్రాసు రమ్మన్నారు. మా Correspondent గారు వెంటనే
మద్రాసు వెళ్ళారు. సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని
తెలుసుకున్న సావిత్రి గారు ఎంతో కదిలిపోయి తన స్వంత డబ్బులు రూ. 104000 /- మొత్తం అయిదు నెలలు బకాయిలకు చెక్కు రాసిచ్చి ముందు సిబ్బంది బకాయిలు
చెల్లించండి. తర్వాత గ్రాంట్ సంగతి మనం చూసుకోవచ్చును అని అన్నారు సర్. " అని
నాకు చెప్పారు . ఇంతకన్నా ఆ మహాతల్లి దాతృత్వానికి నిదర్శనం ఏం కావాలి?
0 Komentar