Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

chandrayaan-2 communication lost with vikram lander

chandrayaan-2 communication lost with vikram lander

చంద్రయాన్ 2 కు ఆఖరి నిముషంలో ఎదురుదెబ్బ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌2 నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్‌ నుంచి గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయని తెలిపారు. 
అసలు ఏమి జరిగింది...?
         అది బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌! సమయం.. శుక్రవారం అర్ధరాత్రి దాటింది. 7వ తేదీ ప్రవేశించింది. అక్కడి కంప్యూటర్ల ముందు కూర్చున్న శాస్త్రవేత్తలందరి ముఖాల్లో తీవ్ర ఉత్కంఠ!! ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ సహా శాస్త్రజ్ఞులందరూ హడావుడిగా ఉన్నారు. సమయం క్షణమొక యుగంలా మరో గంటన్నర సమయం గడిచింది. చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా, 101 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలో సంచరిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ ఆ సమయానికి సరిగ్గా దక్షిణ ధ్రువంపై భాగానికి చేరుకుంది. అదే సమయానికి.. మరికొంత ఎగువన 96 కిలోమీటర్ల దగ్గరగా, 125 కిలోమీటర్ల దూరంగా చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌ సైతం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది. అంతలో.. చంద్రగ్రహంపై సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడి లేత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. ఆ లేలేత వెలుగులో ఆర్బిటర్‌ హైరిజల్యూషన్‌ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ఉపరితలాన్ని పరిశీలించారు. ఎగుడు దిగుళ్లు లేని సమతుల ప్రాంతాన్ని ఎంపిక చేసి విక్రమ్‌ ల్యాండర్‌కు సంకేతాలు పంపారు. ఆ సంకేతాలు అందుకుని కిందికి విక్రమ్‌ కిందికి దిగడం ప్రారంభించింది. అందులో ఉన్న లిక్విడ్‌ థ్రస్టర్‌ ఇంజన్లు మండటం ప్రారంభించి విక్రమ్‌ వేగాన్ని నియంత్రించాయి. ల్యాండర్‌లోని లేజర్‌ అల్టిమీటర్‌, ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా యాక్టివేట్‌ అయ్యాయి. 10 నిమిషాల తర్వాత విక్రమ్‌.. చంద్రునికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్‌ వేగాన్ని థ్రస్టర్‌ ఇంజన్లు గంటకు 526 కిలోమీటర్లకు నియంత్రించాయి. అనంతరం మరో 38 సెకన్లకు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌.. చంద్రునికి 5 కిలోమీటర్ల ఎత్తుకు దిగింది. 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ నిర్ణీత షెడ్యూలు ప్రకారమే వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. విక్రమ్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.
           విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ల్యాండింగ్ లో ఏర్పడిన కమ్యూనికేషన్ సమస్యను వివరించారు. దీంతో మోదీ.. "శాస్త్రవేత్తలుగా మీరు సాధించింది తక్కువేమీ కాదు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం. ఎవరూ నిరుత్సాహపడొద్దు.. మీకు నేనున్నాను" అంటూ శివన్ కు, అక్కడున్న శాస్త్రవేత్తలందరికీ ధైర్యం చెప్పారు. తనతో కలిసి వీక్షణకు వచ్చిన విద్యార్దులతో మోదీ కాసేపు ముచ్చటించారు.


       ఏది ఏమైనా.. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 కోసం చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని ఆశిద్దాం.

చంద్రయాన్‌2 విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని పై దిగే దృశ్యాలు క్రింది వీడియోలో చూడవచ్చు.
Previous
Next Post »
0 Komentar

Google Tags