Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Atla Taddi / Atla Thadiya


Atla Taddi / Atla Thadiya

అట్ల తద్ది / అట్ల తదియ

====================

అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు

అట్లతద్దిముందురోజు నుంచే ఆడపిల్లలు చేతులకు. పాదాలకూ గోరింటాకు పెట్టుకోవడంతో హడావుడిగా ప్రారంభమవుతుంది. ఎవరి చెయ్యి బాగా పండితే వారికి ప్రేమగా చూసుకునే అందమైన భర్త వస్తాడని కన్నెపిల్లల నమ్మకం. అందుకనే నా చెయ్యి బాగా పండాలంటే, నా చెయ్యి బాగా పండాలని ఆడపిల్లలంతా పోటీ పడతారు. ఇక కన్నెపిల్లల తల్లలు మరునాడు ఉమాదేవికి నివేదన చేసే అట్లు కోసం మినగపప్పు రుబ్బుకోవడం, తెల్లవారుఝామునే తమ పిల్లలు తినే చద్దిఅన్నం,గోంగూరపచ్చడి చేయడంలో నిమగ్నమైపోతారు. తండ్రులైతే.. మరునాడు తమ పిల్లలు ఊగడానికి కావలసిన ఉయ్యాలలను చెట్లకు కట్టడంలో బిజీగా ఉంటారు. 

ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.

అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.

గోరింటాకు ప్రాముఖ్యత

అట్లతద్ది నోములో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అట్లతద్దె ముందురోజున నోము చేసుకునే ఆడపిల్లలు చేతులకు, కాళ్ళకు గోరింటాకు అలంకరించుకోవాలి. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు. గోరింటాకు వాళ్ళు అలంకరించుకోవడంతోపాటు ముత్తయిదువకు కూడా ముందురోజే రుబ్బిన గోరింటాకు ముద్దను ఇవ్వాలి.

ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ..?

అంటే తెల్లవారుఝామనే నిద్రలేచి, స్నానాదులు పూర్తి చేసి, సూర్యోదయం కాకముందే చద్దిఅన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని,ఇంత నెయ్యి వేపుకుని, (ఉల్లిపాయ నంజుకుని) తినాలి. ఆ తర్వాత కమ్మటి మీగడపెరుగు వేసుకుని కడుపునిండా భుజించాలి. ఎందుకంటే, తిరిగి చంద్రోదయం అయ్యేవరకూ ఏమీ తినకూడదు. మంచినీళ్లు కూడా తాగకూడదు. ఉదయమంతా అలా ఉపవాసం ఉండి, సాయంకాలం అయ్యేవరకూ ఆటపాటలతో, ఊయలలు ఊగుతూ కాలక్షేపం చేయాలి. దీనినే ‘ఢోలోత్సవం’ అంటారు. ఈ డోలోత్సవం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత చంద్రదర్శనం చేసుకుని, ఫోడశోపచారాలతో ఉమాదేవిని పూజించి, తోరమును కట్టుకుని, పది అట్లు నివేదన చేసి, పది అట్లు,ఒక తోరమును ఒక ముత్తయిదువుకు.

అట్లతద్ది నోము ప్రాముఖ్యత

గౌరీదేవి (పార్వతీదేవి) శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు పార్వతీదేవికి సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.

అట్లు నైవేద్యం చేయడంలో అంతరార్ధం ఏమిటి?

అట్లతద్ది నోములో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కుజుడు. కనుక మహిళలకు ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినపపిండి బియ్యపు పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ రెండింటితో కలిపి తయారుచేసిన అట్లనే వాయనముగా ఇవ్వాలి. దీనివల్ల గర్భస్రావము కలుగకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. 

పురాణ గాధ

పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.

====================

WATCH THIS VIDEO ON OCCASSION OF ATLA TADDI

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags