Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh Formation Day

Andhra Pradesh Formation Day 

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. జాతీయోద్యమ సమయంలోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ నినదించిన తెలుగువారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఇక, తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే, ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. తర్వాత 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ సభలోనూ ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంతగా ఆసక్తి చూపలేదు. తర్వాత పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి చర్చలు జరిగాయి. రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు.

కాకినాడలో జరిగిన నాలుగో ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యతో కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేశారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు. స్వాతంత్రం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్ష ఆంధ్రా ప్రాంతంలో అలజడిరేపినా, కాంగ్రెస్ నాయకులు, నాటి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే, 1952 డిసెంబర్ 1558 రోజుల అకుంఠిత దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులతో సహా అన్ని జాతీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. డిసెంబరు 1953లో ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక 1955 సెప్టెంబర్ 30 న సమర్పించింది., తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే వారిని మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి, తెలుగు ప్రాంతాలను తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే, ఐదేళ్ల తర్వాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరిస్తే ఆంధ్రలో దీనిని విలీనం చెయ్యెచ్చని పేర్కొంది. ఈ సూచనలను సమర్ధించిన వారిలో తెలంగాణకు చెందిన కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు ఉన్నారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించారు.

శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది ఆంధ్ర‌ప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరో 15 మంది తటస్థంగా ఉండిపోయారు. ఈ సమయంలో తెలంగాణా, విశాలాంధ్రవాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేశారు. కమ్యూనిస్టులు మరో అడుగు ముందుకు వేసి తాము శాసనసభకు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆంధ్రప్రదేశ్‌నే సమర్ధించి, ఇరు ప్రాంతాల నేతలు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరఫున బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు.

ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags