Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Makara Sankranthi Festival


Makara Sankranthi Festival

మకర సంక్రాంతి పండుగ

===================

సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి. ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగ ను పెద్ద పండుగ గా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

ఉత్తరాయణం, దక్షిణాయనం

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి - సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.

ముఖ్యమైన సంక్రాంతులు

మకర సంక్రాంతి -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం. సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.

మహా వైషువ సంక్రాంతి -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువులో వచ్చేది)

మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు.

విష్ణు పది సంక్రాంతి - సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు వృశ్చిక సంక్రాంతి.

ధను సంక్రాంతి - చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.

కర్కాటక సంక్రాంతి: జూలై 16, న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. ఈ దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags