ఒక సెకనులో 1000 కంటే
ఎక్కువ HD సినిమాలు డౌన్‌లోడ్ చేయవచ్చు
అత్యాధునిక
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో అనేకానేక అద్భుత ఆవిష్కరణలు
పురుడు పోసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్ట్రేలియాలోని మోనాశ్, స్విన్‌బర్న్,
ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సాధించారు. దీంతో వెయ్యి హై
డెఫినిషన్ (హెచ్డీ) సినిమాలను సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే డౌన్ లోడ్
చేసుకోవచ్చు. ఒకే ఒక ఆప్టికల్ చిప్ సాయంతో 44.2 టీబీపీఎస్ (టెరాబిట్స్ పర్
సెకండ్) డేటా స్పీడ్‌ను అందుకునే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనలో 'మైక్రో కోంబ్ అనే కొత్త పరికరాన్ని ఉపయోగించారు. 80 లేజర్లకు సమానమైన
సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతమున్న టెలికం హార్డ్ వేర్ కన్నా మైక్రో కోంబ్ చాలా
చిన్నగా ఉంది. ఈ సాధనం ఇంద్ర ధనస్సులా వందలాది, అత్యంత
నాణ్యమైన అదృశ్య, పరారుణ లేజర్లను వెదజల్లుతుంది. ఒక్కో
లేజర్ ను ప్రత్యేక కమ్యూనికేషన్ మార్గం (ఛానల్)గా ఉపయోగించుకోవచ్చు.
కాగా డాక్టర్
బిల్ కోర్‌కోరన్ (మోనాశ్), ప్రొఫెసర్ డేవిడ్ మోస్ (స్విన్‌బర్న్),
ఆర్‌ఎమ్‌ఐటీ ప్రొఫెసర్ ఆర్నన్ మిచెల్ నేతృత్వంలోని పరిశోధన బృందం
ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. తద్వారా డేటా ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్స్
రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. మెల్‌బోర్న్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన
డార్క్ ఆప్టికల్స్ నెట్‌వర్క్ (76.6 కి.మీ.) లోడ్ టెస్టు నిర్వహించింది. ఈ మేరకు
తమ ఆవిష్కణకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో
పొందుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ కనెక్షన్ల సామర్థ్యాన్ని
పెంచుకోవడానికి ఈ ఆవిష్కారం తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు. విస్తృత స్థాయిలో కమ్యూనికేషన్ సేవలతో పాటు
స్వయం చోదిత కార్లు, భవిష్యత్ రవాణా వ్యవస్థలు, వైద్యం, విద్య, ఆర్థిక రంగం,
ఈ-కామర్స్ పరిశ్రమలకూ లబ్ధి చేకూరుస్తుందని వివరించారు.
0 Komentar