తలలో
చుండ్రు నివారణా మార్గాలు
తల దురద పెట్టడం
చుండ్రు సమస్యకు ఒక సాధారణ లక్షణం. చుండ్రు ప్రధానంగా 20-40 ఏళ్ల మధ్య వయసువారిలో
ఈ సమస్య ఎక్కువ. అదీ స్త్రీలలోకన్న పురుషులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీ తలలో
చుండ్రు ఉన్నట్లైతే, దురద ఒక సహజ లక్షణంగా మీరు ఎదుర్కోవల్సి
వస్తుంది. జుట్టును వదులుగా వదిలివేయడం వల్ల తలలో దురద మొదలవుతుంది. చుండ్రును
తెలిపే మరో ప్రధాన లక్షణం హెయిర్ ఫాల్. తలలో చుండ్రు ఉన్నప్పుడు సహజంగానే జుట్టు
రాలడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతి రోజూ మనం 20-25 వెంట్రుకలను కోల్పోవల్సి
వస్తుంది.
చుండ్రు ఎలా
పుట్టుకొస్తుంది..
చర్మంలో
ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పై పొరను ఎపిడెర్మిస్
అని, కింది పొరను డెర్మిస్ అని అంటారు. మాడుపైన ఉండే డెర్మిస్ పొరలో నుంచే వెంట్రుకలు
పుట్టుకువస్తాయి. ఈ హెయిర్ ఫాలికల్స్(వెంట్రుకల కుదుళ్లు) పక్కనే సెబేసియస్
గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు సీబమ్ అనే ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ
ఆయిల్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది. దీని ఉత్పత్తి కొంతమందిలో
సాధారణంగా ఉంటే, మరికొందరిలో అసాధారణంగా అంటే.. ఎక్కువగా
ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎపిడెర్మిస్ పొర త్వరగా జిడ్డుగా మారుతుంది. ఈ
జిడ్డుపై ఫంగస్ (మెలస్సీజియా) చేరుతుంది. సహజంగానే ఈ ఫంగస్ కూడా అందరి తలలోనూ
ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా చేరి స్కిన్‌సెల్స్
(చర్మకణాల), సీబమ్‌పై దాడి చేసి, కొన్ని
రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు మృతకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి
దోహదం చేస్తాయి. ఫలితంగా తలలో దురద, చికాకు కలుగుతుంది. దురద
అనిపించగానే గోళ్లతో తలను గీకుతుంటారు. దీంతో మృతకణాలు పైకిలేస్తాయి. పొడిగా మారిన
మృతకణాలు జుట్టు నుంచి రాలి పడతాయి. దానిపేరే ‘చుండ్రు.’ చలికాలం వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం
పొడిబారుతుంది. మృతకణాలు పెరగడంతో పాటు, పొడి పొడిగా మారి
పైకి లేస్తుంటాయి.
చుండ్రు – నివారణ చర్యలు
>తల
దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను
వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.
>పుదీనా రసం
మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.
>మందార ఆకులు, పువ్వు
రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు
రంగులో మారటానికి, చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
>మెంతి ఆకును
దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం
తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.
>తాజా
వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల
చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
>గసగసాలు
కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి.
> మెంతులను
రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని తలంతా
పట్టించి అరగంట అలాగే ఉంచి, కడిగేయాలి. పదిహేను రోజులకు ఒసారి ఇలా
చేస్తే చుండ్రు తగ్గుతుంది. కేశాలు పొడిబారకుండా ఉంటాయి.
>కొద్దిగా వస
కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు
పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు.10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం
చేయాలి.
>ఆరు చెంచాల
నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు
పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
>చుండ్రు
సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట
తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
>అలోవెరా జెల్
ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల
శుభ్రంగా ఉంటుంది.
>వేసవిలో చెమట
వల్ల,
వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి
రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.
>పెరుగులో
కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత
నీటితో తలస్నాం చేయాలి. ఇలా వారానికి 3సార్లు చేస్తేం మంచి ఫలితం ఉంటుంది.
>తలంటుకున్న
తర్వాత టీ స్పూన్ తాజా నిమ్మరసాన్ని మగ్గునీళ్లలో కలిపి ఆ నీటితో జుట్టు తడిసేలా
కడగాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేయాలి.
>రెండు టేబుల్‌స్పూన్ల
పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
>మూడు వంతుల
గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు ఆపిల్ సిడార్ వెనిగార్‌ను కలిపి, ఆ
మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ మిశ్రమం తలకు పూర్తిగా పట్టాక డాక్టర్ సలహా మేరకు
సరైన పీహెచ్ ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి.
>చలి అని
తలస్నానానికి బాగా వేడినీళ్లు వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం పొడిబారి చుండ్రు
ఎక్కువయ్యే అవకాశం ఉంది. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడాలి.
>ఒత్తిడి వల్ల
చుండ్రు పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల నిండుగా బాగా గాలి పీల్చే వ్యాయామాల
వల్ల ఒత్తిడి తగ్గి... తద్వారా చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది.
>తలస్నానానికి
ముందే ఒకసారి జుట్టును బాగా దువ్వుకోవడం వల్ల అప్పటికే తలలో ఏర్పడి ఉన్న పొట్టు
వదులైపోయి మాడు మరింత శుభ్రంగా అయ్యే అవకాశం ఉంది.
>షాంపూలు, మంచి
పోషకాహారం, కొన్ని రసాయన ఆధారిత యాంటీ-డాండ్రఫ్ షాంపూలు
చుండ్రును ఎదుర్కోవడంలో బాగా సహాయపడతాయి.
>వారానికి ఒకసారి
పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్ నూనెను కానీ వెచ్చ చేసి,
తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ
తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.
>చుండ్రుతో
బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా
టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.
>తీక్షణమైన
ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
>తలంటు
స్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.
>పోషకాహార
లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి.
వైద్య నిపుణుల సహాయంతో ఈ
సమస్యను సమర్థంగానే ఎదుర్కోవచ్చు.
0 Komentar