Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CM YS Jagan review meeting on Education Department


ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో సంచలన మార్పులు
>ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు
>ప్రతి మండలానికో హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్పు
>ప్రతీ నియోజకవర్గానికి ఒక DyEO
>జిల్లాల్లో జేసీల పరిధిలోకి విద్యాశాఖ
>8వ తరగతి నుంచే కంప్యూటర్‌ విద్య
>ఆంగ్ల పరిజ్ఞానంపై టోఫెల్ తరహా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్‌ రూపొందించాలని సూచించారు. మంగళవారం పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు సహా నాణ్యమైన విద్యకోసం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మానవవనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై కూడా చర్చ సాగింది. అనంతరం ఆ దిశగా సీఎం జగన్‌.. మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం స్కూలు పిల్లలకోసం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదించగా.. అందుకు సీఎం వైఎస్‌  జగన్‌ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అందులో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని అన్నారు. ప్రైమరీ స్కూళ్ల కు సమీపంలోనే అంగన్‌వాడీలు ఉండాలంటే.. ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలాలు ఉన్నాయా? లేవా? అన్నదాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
పకడ్బందీ పాఠ్యప్రణాళికలు ఉండాలి..
అలాగే పీపీ-1, పీపీ-2 క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. పీపీ-1, పీపీ-2 పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలుండాలని సీఎం తెలిపారు. వీరికి పకడ్బందీ పాఠ్యప్రణాళిక ఉండాలని ఆదేశించారు. ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలతో, పీపీ-1, పీపీ-2 పాఠ్యాంశాల మధ్య  సినర్జీ ఉండాలని సూచించారు.
జూనియర్‌ కాలేజీల స్థితిగతులపైనా చర్చ..
ఈ సమావేశంలో రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల స్థితిగతులపైనా కూడా చర్చ సాగింది. 270 మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రతి మండలానికో హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చేలా తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కాలేజీల్లో ఖాళీను భర్తీ చేయడంపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. పోటీ పరీక్షలకు అవసరమైన విధంగా విద్యార్థులకు బోధన అందించాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసే దిశగా కార్యాచరణ ఉండాలన్నారు. మరోవైపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భనం ఉండేలా చూసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో కూడా సరైన పాఠ్యప్రణాళికను అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనంతరం మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన టీచర్లను నియమించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసకోంటామని చెప్పారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై ఈ సమావేశంలో చర్చించాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తీసుకోస్తాం. జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు ఉంటారు. జిల్లాల్లో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం. పాఠశాలల్లో 8వ తరగతి నుంచే కంప్యూటర్‌ విద్యను అందిస్తాం. ప్రతి జిల్లాలో టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే వర్చువల్‌ కాస్ల్‌ రూమ్‌, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాంఅని తెలిపారు.
మూలం: సాక్షి మీడియా సౌజన్యంతో..

Previous
Next Post »
0 Komentar

Google Tags