‘నిట్’
ప్రవేశాలకు ఇంటర్‌లో 75% మార్కుల నిబంధనకు
మినహాయింపు : కేంద్రం
-ఎన్‌ఐటీలతోపాటు
ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక
విద్యాసంస్థలు(సీఎఫ్‌టీఐ)లకూ వర్తిస్తుంది..
ప్రతిష్టాత్మక
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర
టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత
వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం
పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో
కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను
తొలగించింది. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు(సీశాబ్) గురువారం నిర్ణయం
తీసుకుంది. ఈ మినహాయింపు ఎన్‌ఐటీలతోపాటు ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర
ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు(సీఎఫ్‌టీఐ)లకూ వర్తిస్తుంది. కరోనా
నేపథ్యంలో ఈ ఏడాది నిబంధనను మినహాయించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్
పొఖ్రియాల్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ నిర్ణయం వల్ల ఎలాంటి
ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు
రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1
నుంచి 6 వరకు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన
సంగతి తెలిసిందే.
నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా
సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో
ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం
75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో
టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది.
0 Komentar