Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Land Names in usage language

భూమి: వాడుక భాషలో వాటి పేర్లు

గ్రామ కంఠం: గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
అసైన్డ్‌ భూమి: భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూములుగా పేర్కొంటారు. ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి బదలాయించడానికి వీలుండదు.
ఏడబ్ల్యూ భూములు (Assessed Waste): శిస్తును నిర్థారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్‌ వేస్ట్‌ల్యాండ్‌ అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్‌ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
బంజరు భూమి: గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం: పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
అడంగల్‌: దీనినే పహాణి అని కూడా అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దస్త్రం (రిజిస్టర్‌)లో నమోదు చేస్తుంటారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్‌గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్‌ అని పిలుస్తుండగా తెలంగాణాలో పహాణీగా వాడుకలో ఉంది.
చిట్టా: రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
జమాబందీ: ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకు వచ్చారా లేదా అని నిర్థారించడం, గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు.
అజమాయిషీ: భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు 3లో నమోదు చేయాలి. ఈ విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.
దస్తావేజు: భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో ఈ దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.
ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ): భూ స్వరూపాన్ని తెలియ జేసే ధ్రువపత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను తెలియజేస్తుంది.
ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ): దీనిని ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి.
బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వేనిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు.
బీమెమో: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. అర్హులైతే కొనసాగిస్తారు. అనర్హులైతే తొలగిస్తారు.
ఫసలీ: ఏటా జులై 1 తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ఫసలీఅంటారు. ఈ పదం మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.
ఎకరం: ఇది విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం). వీటిని ఎకరంగా పరిగణిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags