ఆస్తిలో
కూతుళ్లకు సమాన వాటా
-కూతురికి
పుట్టుకతోనే సంపదలో హక్కు
-2005కు ముందు తండ్రి మరణించినా ఆస్తిలో వాటా
-సుప్రీం
కోర్టు త్రిసభ్య ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు
తండ్రి ఆస్తిలో
కుమారుడితో సమానంగా కుమార్తెకూ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ
హక్కు పుట్టుకతోనే వస్తుందని... ఆజన్మాంతం ఉంటుందని తెలిపింది. హిందూ వారసత్వ సవరణ
చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని
సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత
పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు
సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్,
జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది.
హిందూ వారసత్వ
చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా
ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005
నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు
ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు
వ్యాఖ్యానించింది. ‘‘ఒక కొడుకు భార్య వచ్చినంత వరకే కొడుకుగా
ఉంటాడు. అదే కూతురు జీవితాంతం కూతురుగానే ఉంటుంది’’అని తన
తీర్పులో పేర్కొంది.
‘‘2004 డిసెంబరు 20వ తేదీకి ముందు సదరు ఆస్తిని పంపకం
చేసినా, పరాధీనం చేసినా, విభజించినా,
వీలునామా ప్రకారం పంపకాలు చేసినా సరే... హిందూ వారసత్వ చట్టంలోని
సెక్షన్ 6(1) ప్రకారం కుమార్తె కూడా తన వాటా కోసం డిమాండ్
చేయవచ్చు. కుమార్తెకు వారసత్వ హక్కు పుట్టుకతోనే సంక్రమిస్తుంది. అందువల్ల,
చట్ట సవరణ అమలులోకి వచ్చిన (2005 సెప్టెంబరు 9)
నాటికి తండ్రి జీవించి ఉన్నాడా లేడా అన్నదానితో సంబంధం లేదు.
కుమార్తెలకు ఆజన్మాంతం ఈ హక్కు ఉంటుంది’’ అని ధర్మాసనం
స్పష్టం చేసింది.
ఇప్పటికే వివిధ
కోర్టులలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో అప్పీళ్ళు ఉన్నాయని, విభిన్నమైన
తీర్పులివ్వడంతో తీర్పు ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించింది. ఈ అప్పీళ్ళను 6 నెలల్లోగా పూర్తి చేయాలని
ఆదేశించింది.
0 Komentar