Another disease spreading in China ..
Positive for thousands of people
చైనాలో వ్యాపిస్తున్న మరో వ్యాధి..
వేలాది మందికి పాజిటివ్
Brucellosis: ప్రపంచాన్ని
వణికిస్తున్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాలో మరో ప్రమాదకర వ్యాధి
వ్యాపిస్తోంది. ఈసారి బ్యాక్టీరియా వ్యాధి విజృంభిస్తోంది. ఓ ఫార్మా కంపెనీ
నిర్లక్ష్యం వల్ల ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకింది. 3,245
మందికి పాజిటివ్‌గా తేలింది.
కరోనా వైరస్‌కు జన్మస్థానమైన
చైనాలో మరో ప్రమాదకర వ్యాధి వ్యాపిస్తోంది. గన్సూ ప్రావిన్స్ రాజధాని నగరమైన
ల్యాన్‌ఝౌలో ‘బ్రూసెల్లోసిస్’ అనే వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. బ్రూసెల్లా అనే
బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇప్పటివరకు 3,245 మంది ఈ వ్యాధి
బారిన పడ్డారు. నగరంలోని ‘ఝోంగ్మూ ల్యాన్‌ఝౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్
ఫ్యాక్టరీ’ అనే ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఈ వ్యాధి పుట్టుకొచ్చింది. తొలుత
కంపెనీ ఉద్యోగులకు వ్యాపించిన బ్యాక్టీరియా క్రమంగా ల్యాన్‌ఝౌ నగరంలో
విస్తరిస్తోంది.
బ్రూసెల్లోసిస్‌ను ‘మాల్టా ఫీవర్’, ‘మెడిటెర్రేనియన్ ఫీవర్’ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడితే
కోలుకోవడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని వైద్య నిపుణులు
పేర్కొన్నారు. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్‌తో ఈ వ్యాధి నయం అవుతుందని
చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం
ఊరటనిచ్చే అంశం.
బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు:
✧ జ్వరం
✧ తలనొప్పి
✧ కడుపు నొప్పి
✧ కీళ్లు, కండరాల నొప్పి
✧ వెన్ను నొప్పి
✧ చలి, చెమటలు పట్టడం
✧ ఆయాసం, అలసట
✧ ఆకలిగా లేకపోవడం
✧ బరువు తగ్గడం
దీర్ఘకాలిక లక్షణాలు:
బ్రూసెల్లోసిస్ వ్యాధి బారిన పడిన
వారిని కొన్ని సమస్యలు దీర్ఘకాలం వేధించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన
‘సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ తెలిపింది. కీళ్ల నొప్పుల
సమస్య జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొంత మంది సంతాన
సాఫల్యత సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.
మరికొందరిలో అవయవాల్లో వాపు ఏర్పడటం, చీము కారడం లాంటి
లక్షణాలు దీర్ఘకాలంగా వేధించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వ్యాధి ముదురుతున్న
కొద్దీ గుండె, కాలేయం, నాడీ
వ్యవస్థపైనా దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
బ్రూసెల్లోసిస్ ఎలా వ్యాపిస్తుంది?
✧ అపరిశుభ్రమైన ఆహారం ద్వారా ఈ వ్యాధి
వ్యాపిస్తోంది. తొలుత ఝోంగ్మూ ల్యాన్‌ఝౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలోని
ఉద్యోగులకు ఈ బ్యాక్టీరియా సోకింది. ఫార్మా కంపెనీ నుంచి గాల్లో కలిసిన
బ్యాక్టీరియా కంపెనీలోని క్యాంటీన్ నుంచి ఉద్యోగులకు వ్యాపించింది.
✧ పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది.
✧ ప్రధానంగా ఈ బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు
వ్యాపిస్తుంది.
✧ మనిషి నుంచి మనిషికి ఈ బ్యాక్టీరియా
సోకినట్లు ఆనవాళ్లు లేవని సీడీసీ తెలిపింది.
ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం..
వందలాది మందికి ప్రాణ సంకటం
ల్యాన్‌ఝౌ నగరంలోని ఝోంగ్మూ ల్యాన్‌ఝౌ
బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ అనే కంపెనీ నుంచి ఈ బ్యాక్టీరియా బయటకు
వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జంతువుల్లో వ్యాపించే బ్రూసెల్లో బ్యాక్టీరియా
నివారణకు ఈ కంపెనీ వ్యాక్సిన్ తయారీ చేస్తుంది. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో
గడువు తీరిన శానిటైజర్లు, క్రిమినాశినిలు వాడటంతో బ్యాక్టీరియా
రసాయనిక వ్యర్థాల ద్వారా బయటకు వచ్చింది. అనంతరం గాల్లో కలిసి పరిసర ప్రాంతాల్లో
వ్యాపించింది. తొలుత కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో లక్షణాలు కనిపించడంతో వారందరికీ
పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గతేడాది జులై ఆగస్టు మధ్య కాలంలో ఈ
బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ల్యాన్‌ఝౌ నగరంలో
ఇప్పటివరకు 21,847 మందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు.
అనధికారికంగా ఇప్పటివరకు 11,401 మంది ఈ వ్యాధి బారిన
పడినట్లు తెలుస్తోంది. నగరంలో చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నట్లు
సమాచారం.
ప్రత్యేక పరీక్షా కేంద్రాలు.. ఉచిత
చికిత్స
ల్యాన్‌ఝౌ నగరంలో వైద్య పరీక్షల
కోసం ప్రత్యేకంగా 11 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
లక్షణాలు ఉన్న వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి బారినపడ్డ
వారికి ఉచితంగా చికిత్స కూడా అందజేస్తామని స్థానిక ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ ప్రమాదానికి ఝోంగ్మూ ల్యాన్‌ఝౌ
బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ కారణమని తేలడంతో ఆ కంపెనీ అనుమతుల్ని వెంటనే
రద్దు చేసి కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 7
రకాల లైసెన్సులను రద్దు చేసినట్లు తెలిపింది. ఫిబ్రవరిలో కంపెనీ ప్రజలకు బహిరంగ
క్షమాపణలు చెప్పింది. బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. గ్యాస్
లీక్‌కు బాధ్యులైన ఎనిమిది మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
0 Komentar