Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Helpline Numbers For All Government Schemes


AP: Helpline numbers for all government schemes  
ఏపీ: మీకు ప్రభుత్వ పథకాలు అందలేదా.. ఏవైనా సమస్యలున్నాయా.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే
సమస్యలు పరిష్కరించేందుకు ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లు అందబాటులోకి తీసుకొచ్చింది. ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే. 

హెల్ప్ లైన్ నంబర్లు
ఏపీలో జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అలాగే ఉచిత సేవలు అందిస్తోంది. అత్యవసర సమయాల్లో, సమస్యలు పరిష్కరించేందుకు ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లు అందబాటులోకి తీసుకొచ్చింది. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే.
  
1902 (ప్రజా సమస్యలు)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. ఈ నంబర్‌ (1902)కు ఫోన్‌ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువులోగా వాటిని పరిష్కరించుకోవచ్చు.. లేని పక్షంలో మళ్లీ ఫిర్యాదు చేయొచ్చు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి.

1907 (వ్యవసాయం)
వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్ (1907)‌ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.

1912 (విద్యుత్‌ సేవలు)
విద్యుత్‌ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌ (1912)కు ఫోన్‌ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది

14500 (ఇసుక, మద్యం)
ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందొచ్చు. అలాగే ఇసుక డోర్‌ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.

 14400 (అవినీతి నిరోధం)
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ ఏర్పాటు చేశారు. 14400 నంబరుకు ఫోన్‌ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్‌ చేయొచ్చు.

108 (ప్రభుత్వ అంబులెన్స్‌)
అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్‌ చేయవచ్చు. కాల్‌ సెంటర్‌ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.

104 (వైద్యం, ఆరోగ్యం)
ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు.

100 (పోలీసు సేవలు)
ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 24 గంటలూ పని చేస్తుంది.
  
112, 181 (దిశ)
లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్‌ చేస్తే కంట్రోల్‌ రూము నుంచి వారు ఫోన్‌ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు.

101 (అగ్నిమాపక కేంద్రం)
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags