Dharani services from 3 .. Release of Rs. 10 lakhs to each Tahsildar office
3 నుంచి ధరణి సేవలు ..
ఒక్కో తహశీల్దారు కార్యాలయానికి రూ.10 లక్షలు విడుదల
ధరణి పోర్టల్ సేవలో త్వరలోనే
అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మార్వో కార్యాలయాలకు ప్రభుత్వం రూ.10
లక్షలు కేటాయించింది. వీఆర్వోల సేవల్ని కూడా వినియోగించుకోవాలని ఆదేశించింది.
మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్
‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు
జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎమ్మార్వో
కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి
అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఏకీకృత డిజిటల్ సేవల
పోర్టల్ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు సన్నాహాలు
మొదలయ్యాయి.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను
తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సాంకేతిక, మౌలిక
వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు
కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక
సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ
రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు
అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా
కలెక్టర్లకు సూచించింది. అప్పటివరకు వారి వేతనాలను రెవెన్యూశాఖ తరఫునే అందించాలని
చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు ధరణి పోర్టల్ నిర్వహణకు
వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్లు, అదనపు
కలెక్టర్లు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇప్పటివరకు నమోదు కాని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పక్షం రోజుల్లోగా ఆన్‌లైన్‌లో
నమోదు చేయాలన్న సీఎం ఆదేశాలను వెంటనే అమలుచేయాలని సూచించారు.
0 Komentar