DRDO: ‘Abhyas’ missile launch vehicle
test successful
డీఆర్డీఓ మరో ఘనత.. ‘అభ్యాస్’
క్షిపణి ప్రయోగ వాహన పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
రూపొందించిన క్షిపణి పరీక్షలకు ఉపయోగడపడే హీట్ వాహనాలను భారత రక్షణ రంగ పరిశోధన
సంస్థ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
క్షిపణి పరీక్షల్లో ఉపయోగపడే
‘అభ్యాస్’ గగనతల వాహనాలను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా బాలాసోర్‌లోని
చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాలను డీఆర్డీఓ
మంగళవారం నిర్వహించింది. ‘హైస్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్’ (హీట్)గా
పిలిచే ఈ వాహనాలను డీఆర్డీఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్
(ఏడీఈ) అభివృద్ధి చేసింది. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే
క్రమంలో.. వాటిని ప్రయోగించడానికి అభ్యాస్‌ను ఉపయోగిస్తారు.
తాజా ప్రయోగంలో రెండు గగనతల
వాహనాలను పరీక్షించిన డీఆర్డీఓ.. వీటిని స్వయప్రతిపత్తితో ప్రయాణించేలా
తీర్చిదిద్దింది. ల్యాప్‌టాప్ ఆధారిత భూ నియంత్రణ కేంద్రం ద్వారా ఈ ప్రయోగాన్ని
నిర్వహించారు. తాజా ప్రయోగాన్ని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్
వ్యవస్థలు నిశితంగా పరిశీలించాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష
విజయవంతమైనట్టు వెల్లడించారు.
‘అభ్యాస్’ గగనతల వాహనాలు..
నిర్దేశిత లక్ష్యంలో 5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరి, 0.5 మ్యాక్ వేగాన్ని సాధించాయని తెలిపారు. గాల్లో 30
నిమిషాల పాటు ప్రయాణించిన ఈ వాహనాలు.. సంక్లిష్ట మలుపులు తిరిగే సామర్థ్యాన్ని
ప్రదర్శించాయని అధికారులు పేర్కొన్నారు. తాజా ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ
మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్‌డీవోను అభినందించారు.
‘బాలాసోర్‌లోని ఐటీఆర్
నుంచి అభ్యాస్.. హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ వాహనాలను విజయవంతంగా పరీక్షించిన
డీఆర్డీఓ.. మరో మైలురాయిని చేరుకుంది.. వివిధ క్షిపణి వ్యవస్థల నిర్ధారణ లక్ష్యంగా
దీనిని ఉపయోగించవచ్చు.. ఈ ప్రయోగం విజయం సాధించడానికి కారణమైన డీఆర్డీఓ, ఇతర సిబ్బందికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
0 Komentar