Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Know about Sir Mokshagundam Visvesvaraya on the occasion of Engineer's Day




Know about Sir Mokshagundam Visvesvaraya on the occasion of Engineer's Day
మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మూసీ వరదల నుంచి భాగ్యనగరాన్ని కాపాడిన అపర మేధావి
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్‌‍గాను, పాలనాదక్షునిగా ఎంతో కీర్తిని సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 సంవత్సరాల పాటు అపారమైన సేవలనందించి దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు.
మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారు. అలాంటి వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు. ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతి (సెప్టెంబరు 15)ని దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే' జరుపుకుంటారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబరు 15, 1861న చిక్కబళ్లాపూర్ సమీపంలోని ముద్దెనహళ్ళిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్. కానీ 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు విశ్వేశ్వరయ్య. ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో హైస్కూల్ విద్య, 1881లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు.
బొంబాయి‌లోనే కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరారు. అప్పుడే భారతదేశానికి ఓ మేధావి గురించి తెలిసింది. 20వ శతాబ్దంలో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తిని గడించారు. ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
1912 నుండి 1918 వరకు మైసూర్ దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య... మైసూర్‌లోని కృష్ణరాజసాగర్ (కె.ఆర్.ఎస్) నిర్మించారు. మైసూర్ 'ఆదర్శ నగరం'గా మారడంలో ఆయన పాత్ర ఎనలేనిది. హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
దేశాభివృద్ధిలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను 1955లో 'భారత రత్న' పురస్కారంతో గౌరవించింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైన 'బ్రిటిష్ నైట్‌హుడ్'ను కూడా విశ్వేశ్వరయ్య పొందారు. దీంతో ఆయన పేరుకు ముందు 'సర్' వచ్చి చేరింది.

ఉపకార వేతనంతో పుణేలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య.. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. విశ్వేశ్వరయ్య పనితీరు అద్భుతంగా ఉండటంతో.. సుక్నూర్‌ బ్యారేజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమితులయ్యారు. సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. 1909లో మైసూర్‌ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌‌గా నియమించింది. మైసూర్‌ సమీపంలో నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు ఆయనే చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారు.
1900ల్లో మూసీ నదికి వచ్చిన వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యేది. మూసీ వరదల బారి నుంచి భాగ్యనగరాన్ని రక్షించే బాధ్యతలను నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనల ప్రకారమే.. మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారు. జలాశయాల నిర్మాణంతో భాగ్యనగరికి వరద ముప్పు తప్పింది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌లు ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నిజాం నవాబు విన్నపం మేరకు హైదరాబాద్‌కు మురుగునీటి పారుదల వ్యవస్థను ఆయనే రూపొందించారు.
విశాఖపట్నం ఓడ రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. విశాఖ రేవును నిర్మాణ సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది. అలల తీవ్రతను తగ్గించడం కోసం ఆయన ఆయన ఓ సలహా ఇచ్చారు. రెండు పాత నౌకల్లో బండరాళ్లు వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు.
తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటు కోసమూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి చేశారు. ఇంజినీర్‌గా, మైసూర్ దివాన్‌గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1955లో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందజేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags