Methane is abundant in the KG basin -
twice as much as the world's fossil fuels
కేజీ బేసిన్‌లో విస్తారంగా మీథేన్ -
ప్రపంచంలో ఉన్న శిలాజ ఇంధనానికి రెట్టింపు
కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంతంలో
అపార ఖనిజ సంపదలున్నాయి. ఇప్పటికే గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తుండగా.. తాజాగా, శిలాజ
ఇంధనం మీథేన్ భారీగా ఉన్నట్టు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి
(కేజీ) బేసిన్ సహజ వనరులు అపారంగా ఉన్నట్టు మరోసారి బయటపడింది. కేజీ బేసిన్2లో
భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఏకంగా 0.56 నుంచి 7.68 లక్షల ట్రిలియన్
క్యూబిక్ ఫిట్ మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
(ఏఆర్‌ఐ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది బయటపడింది. అధ్యయన ఫలితాలను మెరైన్
జీనోమిక్స్ అనే మ్యాగిజైన్‌లో ప్రచురించారు.
‘పర్యావరణహితమైన మీథేన్
దహన ప్రక్రియలో హానికారక ఉద్గారాలు పెద్దగా వెలువడవు.. ఆక్సిజన్‌తో కలిసి
మండించినప్పుడు దీనికి సంబంధించిన ఒక అణువు.. రెండు నీటి అణువులను, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువును విడుదల చేస్తుంది. ఆర్థిక కోణంలోనూ ఇది
ప్రయోజనకర ఇంధనం. ఇటీవల కేజీ బేసిన్‌లో ఇంధన నిల్వలపై పరిశోధనలు నిర్వహించినప్పుడు
బయోజెనిక్ ఆరిజిన్ మీథేన్ హైడ్రేట్ నిల్వలను కనుగొన్నారు’ అని కేంద్ర శాస్త్ర,
సాంకేతికశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘శిలాజ ఇంధన వనరులు
అంతరించిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ శుద్ధ ఇంధనం వైపు చూస్తున్న ప్రపంచానికి ఇది
శుభవార్త! కేజీ బేసిన్‌లో సమృద్ధిగా మీథేన్ నిల్వలున్నట్లు శాస్త్రవేత్తల
అన్వేషణలో వెల్లడయ్యింది. వాటి ద్వారా తగినంత పరిమాణంలో మీథేన్ వాయువు సరఫరా
కానుంది’ అని పేర్కొంది. మెథనోజెన్‌లు అనే సూక్ష్మజీవులు ఈ బయోజెనిక్ మీథేన్‌ను
ఉత్పత్తి చేస్తున్నాయని, అది మీథేన్ హైడ్రేట్‌గా అందుబాటులో
ఉంటోందని తెలిపింది. ఒక ఘనపు మీటరు మీథేన్ హైడ్రేట్‌లో 160-180 క్యూబిక్ మీటర్ల మేర మిథేన్ ఉండొచ్చని అంచనా.
‘తక్కువలో తక్కువగా అంచనా
వేసుకున్నా కేజీ బేసిన్‌లోని మీథేన్ హైడ్రేట్లలో ఉన్న మీథేన్.. ప్రపంచవ్యాప్తంగా
అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది’ అని ఏఆర్‌ఐ
శాస్త్రవేత్తల పేర్కొన్నారు. అధిక పీడనాలు, మహాసముద్రాలలో
తక్కువ ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్-బంధిత నీరు, మీథేన్ వాయువు
సంయోగం చెందినప్పుడు మీథేన్ హైడ్రేట్ ఏర్పడుతుంది.
ఈ ప్రాంతంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు
మెథనోజెన్‌లకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. అండమాన్ తీరం, ఒడిశాలోని మహానది వద్ద కూడా ఈ నిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ
ప్రాంతాలతో పోలిస్తే కేజీ బేసిన్‌లో మెథనోజెనిక్ వైవిధ్యత అధికంగా ఉందని
వ్యాఖ్యానించారు. దీనిపై తదుపరి అధ్యయనాలు నిర్వహించాలని సూచించారు. కేజీ బేసిన్,
అండమాన్, మహానది తీరానికి సమీపంలో బయోజెనిక్
మీథేన్ హైడ్రేట్ అనుబంధమైన మెథనోజెనిక్ నిక్షేపాలపై అధ్యయనం నిర్వహించాల్సిన అవసరం
ఉందని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ విక్రమ్ బి లాంగేకర్ అన్నారు.
పరమాణు, క్లచ్చరింగ్
పద్ధతులను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. పరిశోధన కోసం కేజీ బేసిన్, అండమాన్, మహానది తీరం నుంచి మీథేన్ హైడ్రేట్
నిక్షేపాలతో సంబంధం ఉన్న అవక్షేపాలను ఏఆర్ఐ శాస్త్రవేత్తలకు మహారాష్ట్రలోని ఓఎన్‌జీసీ
గ్యాస్ హైడ్రేట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్ అందజేసింది.
0 Komentar