The first American cricketer to enter into the IPL
ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న తొలి
అమెరికా క్రికెటర్
IPL 2020లో ఓ పాకిస్థానీ
ప్లేయర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలో దిగబోతున్నాడు. పాక్‌లోనే పుట్టి
పెరిగిన అలీ ఖాన్ 18 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లాడు.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి వారం
రోజుల ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లాండ్
స్పీడ్‌స్టర్ హ్యారీ గుర్నీ భుజం గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో
అమెరికాకు చెందిన అలీ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న
తొలి అమెరికన్ క్రికెటర్ అలీ ఖాన్ కావడం విశేషం.
కుడి చేతి వాటం పేసర్ అయిన్ అలీ
ఖాన్ పాకిస్థాన్‌లో పుట్టాడు. ఈ వారం జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో
విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్)లో అలీ ఖాన్ సభ్యుడు. టీకేఆర్
కోల్‌కతా నైట్ రైడర్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అనే సంగతి తెలిసిందే. 2018 నుంచి కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్, వెంకీ మైసూర్‌తో
అలీఖాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.
డ్వేన్ బ్రావోతో కలిసి అలీ ఖాన్
విమానంలో దుబాయ్ చేరుకుంటాడు. 29 ఏళ్ల ఈ పేసర్ పాకిస్థాన్‌లోనే పుట్టి
పెరిగాడు. 18 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత
అమెరికన్ క్రికెట్ జట్టులో సభ్యుడయ్యాడు. ఇప్పటి వరకూ ఒకే ఒక అంతర్జాతీయ వన్డే
మ్యాచ్ ఆడినప్పటికీ.. అనేక టీ20 లీగ్‌ల్లో ఆడాడు. కరేబియన్
ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబి
టీ10 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తోపాటు
ఇతర లీగ్‌ల్లో అలీ ఆడాడు.
ఐపీఎల్ 2020 వేలంలో పేరు నమోదు చేసుకున్న ఏకైక అమెరికా ఆటగాడు ఖాన్ కావడం గమనార్హం. 2019 వేలానికి కూడా అతడు రిజిస్టర్ చేయించుకున్నాడు. 2018 నుంచి ఈ పేసర్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. 2018లో 16 వికెట్లు తీసిన ఈ పేసర్.. 2019లో 10 వికెట్లు, ఈ ఏడాది 8 వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో బరిలో దిగుతున్న తొలి
అమెరికా ఆటగాడు అలీ ఖాన్. కాగా ఇంతకు ముందు ఐపీఎల్‌లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు తర్వాత
అమెరికా జట్టు తరఫున ఆడారు. పంజాబ్‌కు చెందిన సన్నీ సోహైల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆర్సీబీ,
డెక్కన్ ఛార్జర్స్ జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు. పంజాబ్ తరఫున దేశవాళీ
క్రికెట్ సైతం ఆడిన సోహైల్ తర్వాత అమెరికా వెళ్లాడు. సౌతాఫ్రికా తరఫున ఆడి ఐపీఎల్‌లో
అడుగుపెట్టిన రస్టీ థెరాన్ ప్రస్తుతం అమెరికా జట్టులో సభ్యుడు.
2008లో ఆరంభ సీజన్‌లో
పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో భాగమయ్యారు. కానీ 2009
నుంచి ఈ లీగ్‌లో పాక్ క్రికెటర్లు ఆడకుండా నిషేధం విధించారు. మళ్లీ ఇన్నాళ్లకు అలీ
ఖాన్ రూపంలో.. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఓ క్రికెటర్ అమెరికా ప్లేయర్‌గా
ఐపీఎల్‌లో భాగం అవుతున్నాడు.
0 Komentar