The secret of New Zealand's Prime
Minister Jacinda Ardern's success
న్యూజిలాండ్ ప్రధాని జసిండా
ఆర్డెర్న్ విజయ రహస్యం
37 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని
పీఠమెక్కిన జసిండా పట్టుదలకీ ఆత్మవిశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం న్యూజిలాండ్
ప్రధాని జసిండా ఆర్డెర్న్. ఈ మధ్య న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చి పార్లమెంటు భవనం
ఊగిపోతే- ఆ సమయానికి అక్కడ ఓ జాతీయ ఛానల్‌కి లైవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న జసిండా
నవ్వులు చిందిస్తూనే ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు తప్ప మొహంలో ఆందోళననూ
కనబరచలేదు, భయంతో బయటకీ పరుగు తియ్యలేదు. యావత్ ప్రపంచాన్నీ తన
గుండె ధైర్యంతో ఫిదా చేసిన ఆ యువ ప్రధాని ప్రపంచంలోనే తొలుత సూర్యోదయాన్ని చూసే
న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో అదో మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద రోజ్
ఆర్డెర్న్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతోద్యోగి. అతని భార్య లారెల్. వీరికి
లూయీస్ ఆర్డెర్న్, జసిండా ఆర్డెర్న్‌లు సంతానం. మగపిల్లలు
లేని ఆ కుటుంబంలో జసిండా టామ్ బాయ్‌లా పెరిగింది. ఫామ్ హౌస్‌లోని ఆపిల్ తోట నిర్వహణలో చురుగ్గా
పాల్గొనడంతోపాటు వారాంతాల్లో ట్రాక్టర్ నడపడం నేర్చుకుని పనుల్లో తండ్రికి
సాయపడేది. అలా పెరిగిన జసిండాపై మేనత్త మేరీ ఆర్డర్న్ ప్రభావం ఎంతో ఉంది. ఆమె
లేబర్ పార్టీ కార్యకర్త. అందుకేనేమో 'నువ్వేమవుతావు'
అని జసిండాను టీచర్ అడిగితే 'పొలిటీషియన్'
అని ఠక్కున బదులిచ్చిందట. ఆ సమాధానానికి ఆశ్చర్యపోవడం టీచర్
వంతైంది. 'అలాంటి సబ్జెక్టుకు సంబంధించి చేయడానికి
ప్రాజెక్టులేం ఉండవుగా' అని టీచర్ అనడంతో 'ఎందుకు లేదూ... ఎంపీ మారలిన్ వారిన్‌ను ఇంటర్వ్యూ చేసి ప్రాజెక్టు
చేస్తా. ఆమె హేతువాది, స్త్రీవాది, రచయిత్రి,
మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ
ఉద్యమకారిణి... 'అని గడగడా చెప్పేస్తుంటే టీచర్‌కే
ముచ్చటేసిందట. ఎనిమిదేళ్ల వయసులో జసిండా అలా మాట్లాడటమే కాదు మారలిన్ అపాయింట్‌మెంట్
కూడా తీసుకుని ఇంటర్వ్యూ చేసి ప్రాజెక్టును చకచకా పూర్తి చేసేసింది. అలానే,
కళ్లెదుట తప్పు జరిగితే అగ్ని కణికలా భగభగ మండిపోయే జసిండా, మారలిన్ స్ఫూర్తితో మానవహక్కుల సంఘంలో సభ్యురాలై చుట్టుపక్కల జరిగే
అన్యాయాలను కమిషన్ దృష్టికి తీసుకెళుతూ అందరి చేతా శభాష్ అనిపించుకునేది.
మరోవైపు చేపల చిరుతిళ్లు అమ్మే 'ఫిష్ అండ్ చిప్' అనే చెయిన్ రెస్టరెంట్‌లో గ్రాడ్యుయేషన్ అయ్యేవరకూ సేల్స్‌గాళ్‌గా పని
చేసింది. కాలేజీలో కూడా విద్యార్థి నాయకురాలిగా ఉండి వారి సమస్యల్ని
పరిష్కరించడంలో ముందుండేది.
టీనేజీ అంటే ఎవరికైనా ఓ స్వీట్
నథింగ్. సరదాలూ, సంతోషాలకూ ఓ కేరాఫ్ అడ్రస్. అయితే జసిండా
మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటూనే పదిహేడేళ్ల
వయసులోనే లేబర్‌పార్టీలో చేరి హుందాతనాన్ని ఆభరణంగా చేసుకున్నారు. మేనత్తతో కలిసి
పార్టీ ప్రచారాలకు వెళ్లి లేబర్‌పార్టీ తరపున గళం విప్పేది. అంత చిన్న వయసులోనే ఓ
పార్టీలో క్రియాశీల వ్యక్తిగా మారడానికి కారణం పెద్దపెద్ద పదవుల్ని ఆశించడమో,
హోదా పేరూ వంటివి కోరుకోవడమో కాదు. సమాజానికి తనవంతుగా ఏదైనా
చేయాలనే సంకల్పమే జసిండాను రాజకీయాల దిశగా మళ్లించింది. అందుకే వైకాటో
యూనివర్సిటీలో పీజీ అయ్యాక న్యూయార్క్ వెళ్లి అక్కడ నిరుపేదలకూ, ఇళ్లులేని వారికి 'సూప్ కిచెన్' పేరుతో అన్నదానం చేసే కేంద్రాల్లో వాలంటీరుగా చేశారు. కొన్నాళ్లకి అక్కడి
నుంచి తిరిగొచ్చి రాజకీయాల్లో ఉంటూనే ఓ కార్పొరేట్ సంస్థలో చేరారు. కొంత కాలం
పనిచేశాక తన 28వ ఏట అంటే- 2008లో మౌంట్ ఆల్బర్త్ నుంచి పోటీ చేసి ఎంపీగా
ఎన్నికయ్యారు. అప్పట్నుంచీ 2017లో ప్రధాని అయ్యేవరకూ ఆ విజయ పరంపరను
కొనసాగించారామె. చాలా తక్కువ కాలంలోనే ప్రజల మనసు గెలుచుకున్న జసిండా గాడి తప్పిన
లేబర్ పార్టీ భవిష్యత్తుని మార్చగలరని నమ్మి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఆమెకు
అవకాశం ఇచ్చారు మాజీ అధ్యక్షుడు.
వాస్తవానికి జసిండా ప్రధాని రేసులో
ఉన్నారనే విషయం ఆమెకి నెలరోజుల ముందే తెలిసింది. ఎన్నికల్లో ఫలితాలను కూడా ఆమె
ఊహించలేకపోయారు. కారణం జసిండా ఎంపీగా ఎన్నికైన లేబర్ పార్టీ తొమ్మిదేళ్లపాటు
ప్రతిపక్షంలోనే ఉంది. బలహీనంగా ఉన్న ఆ పార్టీకి 2017 ఎన్నికలు సానుకూల
ఫలితాలనిస్తాయన్న నమ్మకం కూడా లేకపోయింది. పరిస్థితులు క్లిష్టంగా ఉన్న సమయంలో ఆ
పార్టీ పగ్గాలను తీసుకోవడంతోపాటు, ప్రధాని రేసులో నిల్చోవడం జసిండాకు
పెను సవాలే. ఆ సమయంలో నాయకుడు తనపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే ఒకే ఒక ఆశయంతో
లేబర్‌పార్టీ పగ్గాలను అందిపుచ్చుకున్నారు. అప్పటికే ఆ సీటుపైన కన్నువేసిన ఎందరో
మగమహామహులు 'ఆమెకు ఏమాత్రం రాజకీయానుభవంగానీ నైపుణ్యాలుగానీ
లేవు. లేబర్‌పార్టీ ఇక మీదట గెలుపు అనేది ఎరగదు' అంటూ
రకరకాలుగా విమర్శలు సంధించారు. అయినా అవేమీ చెవికెక్కించుకోకుండా పెద్ద ఎత్తున
ప్రచారం చేసి... పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఉపన్యాసాలతో ఓటర్లనూ తనవైపుకు
తిప్పుకోగలిగారు. అందుకు నిదర్శనంగా లేబర్ పార్టీని పీఠమెక్కించి ఆ దేశంలో పిన్న
వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా జసిండా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆమె ప్రధాని
రేసులో ఉన్నారని తెలిసిన రోజే ఆమె తల్లి కాబోతున్న విషయం కూడా తెలుసుకున్నారు. ఆ
సమయంలో బలహీనంగా ఉన్నా, నీరసంగా అనిపించినా పార్టీకి విజయం
చేకూర్చాలనే సంకల్పం ఆమెని ముందుకు నడిపింది. గర్భిణిగానే ప్రధాని కుర్చీని కూడా
అధిష్టించారామె. అధికారంలో కొనసాగుతూ పసికందుకు జన్మనిచ్చిన రెండో నాయకురాలిగానూ
మరో రికార్డును నెలకొల్పారు జసిండా. మొదటిసారి అలా జన్మనిచ్చింది పాక్ మాజీ
ప్రధాని బేనజీర్ భుట్టో.
కరోనా కట్టడి విషయంలోనూ తనకు తానే
సాటి అనిపించుకున్నారు జసిండా. తొలినాళ్లలో కఠినమైన లాక్‌డౌన్ ప్రకటించారు.
పరీక్షల్ని మరింత వేగవంతం చేశారు. ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధైర్యం
చెబుతుంటే- అమ్మ నిద్రపుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆమె మాటలు అనేవారు ప్రజలు.
అలానే జనాలెవరూ ఒత్తిళ్లకీ, మానసిక సమస్యలకీ గురి కాకుండా బబుల్
ప్రయోగం చేశారు. బయటకు వెళ్లకుండా ఇళ్లలో ఉన్నవారిని బృందంగా(బబుల్) భావించారు.
కొన్ని రోజుల తరవాత వారికి అతి సమీపంలో అదేవిధంగా లాక్‌డౌన్‌లో ఉన్న బంధువుల్నో,
స్నేహితుల్నో కలవడానికి అనుమతిచ్చారు. అలా ఎన్నో జాగ్రత్తలు
తీసుకుంటూ కరోనా కట్టడి చేసిన జసిండా మరోసారి విలక్షణతను చాటుకున్నారు. భూ
ప్రకంపనల వల్ల కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా, తానున్న
పార్లమెంట్ భవనం సైతం కంపిస్తున్నా, ఓ టీవీ ఛానల్‌కి
ఇస్తున్న ఇంటర్వ్యూను ఆమె చివరి వరకూ కొనసాగించారు. 'ఇక్కడ
చిన్నపాటి భూకంపం వచ్చింది. భూమికొద్దిగా కంపిస్తోంది. నాముందున్న ప్రదేశం
కంపించటం గమనించొచ్చు...' అంటూ సంభాషణ కొనసాగించిన జసిండా
భూమి కంపించడం ఆగిపోయాక మేమంతా క్షేమంగా ఉన్నాం అంటూ లైవ్‌లో అందరికీ చెప్పారు. ఈ
ఒక్క ఉదాహరణ చాలు మహిళలు మహా గట్టివారని నిరూపించడానికి.
0 Komentar