Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Five Amazing Benefits of Beetroot

 

Five Amazing Benefits of Beetroot

బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలు

బీట్‌రూట్‌ను తక్కువ అంచనా వేయకుండా. దాని రంగు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. అందులోని పోషకాలు అంతకంటే రెట్టింపు ఆరోగ్యాన్ని శరీరానికి అందిస్తాయి. అవేంటో చూసేయండి మరి. 

కూరగాయలు కొనేప్పుడు.. బీట్‌రూట్‌ను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా? అయితే మీరు ఆరోగ్యా్న్ని అంగట్లో వదిలేసినట్లే. ఎందుకంటే.. బీట్‌రూట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌గా పనిచేస్తుందో. కూరగాయల్లో బీట్‌రూట్ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్ తింటే.. అనారోగ్యాన్ని బీట్ చేస్తారు. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేయాలన్నా.. బీట్‌రూట్ తప్పకుండా తినాల్సిందే. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. మరి, పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా! 

1. జ్ఞాపకశక్తి పెరుగుతుంది

బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు బీట్‌రూట్ ఎంతో మంచిదట. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందట. 

2. కొవ్వు కరుగుతుంది.. ఉత్సాహంగా ఉంటారు

రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బీట్‌రూట్ వల్ల బద్దకం కూడా దరిచేరదట. ఎనర్జీ డ్రింక్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే బదులు.. బీట్ రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సొంతం చేసుకోండని సూచిస్తున్నారు. బీట్‌రూట్ అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుందట. 

3. గుండె సమస్యలు దరిచేరవు

రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె పనితీరు కూడా బాగుంటుంది. ఈ విషయంలో బీట్‌రూట్ మించినది మరేదీ లేదు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. చ‌ర్మాన్ని కాంతివంతం చేయ‌డానికి బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది. 

4. శారీరక దారుఢ్యం కోసం

ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవల్సిందే. ఎందుకంటే బీట్‌రూట్ నిత్యం తినేవారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుందని ‘న్యూట్రియన్ట్స్ - ఓపెన్ ఎక్సెస్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రీషన్’ వెల్లడించింది. బీట్‌రూట్‌ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవని సర్వే వివరాల్లో పేర్కొంది. ముఖ్యంగా అథ్లెట్స్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారిలో స్టామినా మరింత పెరుగుతుందని తెలిపింది. ఆటలకు 90 నిమిషాల ముందు బీట్‌రూట్ జ్యూస్ తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుందని చెప్పడం గమనార్హం. బీట్‌రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తంలో నైట్రేట్ రెట్టింపు కావడం వల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. 

5. రక్త హీనత సమస్య ఉండదు

మైనర్ తలసేమియా, రక్తహీనత బాధపడేవారికి ఐరన్ ఎంతో ముఖ్యం. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య ఉండదు. బీట్‌రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా కాపాడుతుంది.

గమనిక: పై వివరాలన్నీ కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇందులో మీకు ఎలాంటి సందేహాలున్నా.. తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణులను అడిగి తెలుసుకోవాలి. కొన్ని పండ్లు, కూరగాయలను పచ్చి తినడం, తాగడం వల్ల అలర్జీలు, ఇతరాత్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. మీ శరీరతత్వం సమస్యలను ఆధారంగా నిపుణుల సూచన మేరకు పైన పేర్కొన్న డైట్‌ను తీసుకోవాలని మనవి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags