రూ.500కే కరోనా
టెస్ట్.. ఇక మరింత సులభం
కరోనా పరీక్ష ఇక మరింత సులభతరం కానుంది. పైగా తక్కువ ఖర్చుతోనే ఫలితం. ఐఐటీ, ఖరగ్‌పూర్ సరికొత్త కొవిడ్-19 టెస్ట్ కిట్ కనుక్కొంది.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను సరళతరం చేసే దిశగా పరిశోధకులు నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, ఖరగ్‌పూర్ పరిశోధకులు అతి తక్కువ ఖర్చుతో కొవిడ్-19 నిర్ధారణ చేయగలిగే విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సరికొత్త పరికరం ద్వారా కేవలం రూ.500లకే కరోనా పరీక్ష పూర్తవుతుంది. ‘కొవిరాప్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ పరికరం ఖరీదు కేవలం రూ.10,000 మాత్రమే కావడం మరో విశేషం.
ఈ కొత్త విధానంలో కరోనా పరీక్షను నిర్వహించడం చాలా సులభమని పరిశోధకులు తెలిపారు. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. IIT, Kharagpur ప్రొఫెసర్లు సుమన్ చక్రబర్తి, డాక్టర్ అరిందమ్ మొండెల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విధానాన్ని కనుగొన్నారు. దీనికి ICMR అనుమతి కూడా లభించింది.
కొవిరాప్ పరికరానికి పేటెంట్ హక్కులను పొందిన తర్వాత భారీ ఎత్తున ఉత్పత్తికి సాధ్యం అతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరక్టర్ వీకే తివారీ పేర్కొన్నారు. ఇందుకుగాను వివిధ సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ బృందం ఆవిష్కరణను
కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కొనియాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్
లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఐఐటీ, ఖరగ్‌పూర్ విద్యార్థుల వైద్య
ఆవిష్కరణ ప్రశంసనీయం. కనీస శిక్షణతో గ్రామీణ యువత కూడా ఈ పరికరాన్ని తేలిగ్గా
ఉపయోగించగలదు. దీనికయ్యే వ్యయం కూడా చాలా తక్కువ. ఎక్కడికైనా సులభంగా తరలించడానికి
అనువుగా ఉన్న ఈ పరికరం అనేక మంది గ్రామీణ ప్రజల ప్రాణాలు నిలబెడుతుంది’ అని ఆయన
అన్నారు.
0 Komentar