JEE-Advanced candidates who missed exam
will get second chance next year
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మరో అవకాశం - జాయింట్ అడ్మిషన్స్ బోర్డు నిర్ణయం
జేఈఈ అడ్వాన్స్‌డ్–2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్–19 కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన, అడ్వాన్స్‌డ్‌కు సరైన సన్నద్ధత లేక సఫలం కాలేకపోయిన వారికి ఇదో మంచి అవకాశం. అయితే వీరు జేఈఈ అడ్వాన్స్‌డ్–2021లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్–2021కు ఈ అభ్యర్థులు 2020 మెయిన్స్ అర్హతతోనే హాజరుకావచ్చు. వీరు 2021 జేఈఈ మెయిన్స్‌ను రాయాల్సిన అవసరం లేదు. కేవలం 2020 జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులకు మాత్రమే ఇది పరిమితం. కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జేఏబీ నిబంధనల నుంచి సడలింపు
కోవిడ్–19ను దృష్టిలో ఉంచుకుని జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) అర్హత తదితర నిబంధనల నుంచి వీరికి సడలింపు ఇచ్చింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చి అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు, సఫలం కాలేకపోయిన వారికి సమానావకాశాలిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏటా నమోదిత విద్యార్థులలో నాలుగింట ఒక వంతు మంది ఆ పరీక్షకు హాజరు కావడం లేదు.
సమన్యాయం చేసేందుకు..
జేఈఈ అభ్యర్థులకు సమన్యాయం చేయడం
కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 అడ్వాన్స్‌డ్‌కు అవకాశం పొందిన అభ్యర్థులు
అదనపు అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2021 జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి
సంఖ్యకు వీరు అదనం. అర్హతలు, వయసు, ఇతర
అంశాల్లో కూడా వీరికి సడలింపు ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్–2020కు 2.5 లక్షల మంది
అర్హత సాధించగా.. వారిలో 1.50 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం,
ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఒక అభ్యర్థికి రెండు ప్రయత్నాలు మాత్రమే
అనుమతిస్తున్నారు. ఆయా విద్యార్థులు చివరి సంవత్సరం లేదా ఆ సంవత్సరం పరీక్ష రాయక
రెండవ ప్రయత్నంలో ఉన్నవారికి సడలింపు ఇస్తున్నారు. అదే జేఈఈ మెయిన్స్‌ను వరుసగా
మూడుసార్లు రాసేందుకు అవకాశం ఇస్తున్నారు. జేఈఈ మూడుసార్లు రాసినా అడ్వాన్స్‌డ్‌ను
వరుసగా రెండేళ్లు రాయడానికి మాత్రమే వీలుంటుంది. ఈ సంఖ్యను పెంచాలని విద్యార్థులు,
తల్లిదండ్రులు ఎప్పుటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
0 Komentar