Microsoft To Let Employees Work from
Home Permanently
ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. మహమ్మారి వ్యక్తిగత అలవాట్లు, పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల ఆలోచనా విధానాలను మహమ్మారి మార్చివేసింది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు, కార్యాలయాల్లో వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు ఐటీ కంపెనీలు దీనిని శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తున్నాయి. తాజాగా, ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఉద్యోగుల విధులకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా ఈ విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని ముందుంచింది. అయితే, అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని షరతు విధించింది.
హార్డ్‌వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణలో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని వెల్లడించింది. అయితే, వీరికి సగం లేదా అంతకంటే తక్కువ పనిదినాల్లో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించింది. దీనిపై ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది.
అంతేకాదు, శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇచ్చింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు లేదా విదేశీయులు తమ దేశాలకు కూడా వెళ్లి పనిచేసుకోవచ్చని తెలిపింది. కానీ, ఆ మేరకు జీతభత్యాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి మేనేజర్ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. అయితే, కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత కార్యాలయాల పనివేళల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.
ఇప్పటికే పలు ఐటీ దిగ్గజాలు వర్క్
ఫ్రమ్ హోమ్ విధానాన్ని శాశ్వతం చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ సైతం తన
ఉద్యోగుల్లో సగం మంది రాబోయే ఐదు నుంచి పదేళ్ల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు
ప్రకటించింది. ట్విటర్, స్క్వేర్ తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే
విధానాన్ని అనుసరించనున్నాయి. అమెరికాలో వచ్చే ఏడాది జనవరికి ముందు మైక్రోస్టాఫ్
తన కార్యాలయాన్ని తెరిచే అవకాశం లేదు.
కరోనా వైరస్ మహమ్మారి మనందరినీ కొత్త మార్గాల్లో ఆలోచించడం, జీవించడం, పనిచేయాలని సవాల్ చేసిందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కథ్లీన్ హోగన్ పేర్కొన్నారు. వ్యాపార అవసరాలను సమతౌల్యం చేసుకుంటూ, మన సంస్కృతిని జీవించేలా చూసుకుంటూ, వ్యక్తిగత పనితీరుకు మద్దతు ఇవ్వడానికి మేము వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
వర్క్ ఫ్రమ్ హోం విధానం శాశ్వతంగా కొనసాగించాలని కాదు.. కానీ కాలక్రమేణా పని చేసే విధానాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.. ఉద్యోగుల పనితీరు, డేటా, వ్యక్తిగత వర్క్‌స్టైల్, వ్యాపార అవసరాలకు మద్దతు ఇవ్వడంలో నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
0 Komentar