Remdesivir Didn't Cut Hospital Stay Or
Mortality In Covid Patients: WHO
రెమిడిసివిర్ వల్ల ప్రయోజనం
శూన్యం.. తేల్చిచెప్పిన డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం
కరోనా వైరస్‌కు ప్రస్తుతం ఎటువంటి ప్రత్యేక ఔషధాలు, చికిత్సా విధానం లేకపోవడంతో అందుబాటులో ఉన్న యాంటీ-వైరల్ డ్రగ్స్‌ను అత్యవసర వినియోగం కింద బాధితులకు అందజేస్తున్నారు.
కరోనా వైరస్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెమిడిసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి యాంటీ వైరల్ ఔషధాలను ఉపయోగిస్తున్నారు. అయితే, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులపై గిలిద్ సైన్సెస్‌కు చెందిన రెమ్‌డెసివిర్ ఎటువంటి ప్రభావం చూపడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనంలో వెల్లడయ్యింది. బాధితులు కోలుకునే సమయం సహా మరణం ముప్పును తగ్గించడంలోనూ ఈ ఔషధం దోహదపడలేదని తేలింది.
కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్(రిటోనవిర్), ఇంటర్‌ఫెరాన్ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై డబ్ల్యూహెచ్ఓ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది. మరణం ముప్పు తప్పించడం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంలో ఈ ఔషధాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ ప్రయోగాల ద్వారా గుర్తించినట్లు డబ్ల్యూహెచఓ తెలిపింది. అయితే, ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫలితాలపై గిలీద్ సైన్సెస్ పెదవి విరించింది. ఈ వివరాలు అస్థిరంగా ఉన్నాయని, వెల్లడించిన సమాచారం నిర్మాణాత్మకమైన శాస్త్రీయ చర్చకు అనుకూలంగా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్-19 బాధితులకు చికిత్సా సమయాన్ని రెమిడిసివిర్ ఐదు రోజులకు తగ్గించినట్టు తాము 1,062 మందిపై చేపట్టిన అధ్యయనంలో వెల్లడయ్యిందని ఇటీవల గిలిద్ సైన్సెస్ ప్రకటించింది.
కొవిడ్ -19 బాధితుల చికిత్సకు వినియోగానికి అనుమతి పొందిన తొలి ప్రయోగాత్మక ఔషధం ఇదే కావడం గమనార్హం. అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ మే నెలలోనే అనుమతినిచ్చింది. తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చికిత్సలో కూడా దీన్ని వినియోగించారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్
(రిటోనవిర్) ప్రభావం చూపడంలేదని తేలడంతో జూన్‌లోనే ఈ ఔషధాల వాడాకాన్ని
నిలిపివేశాం కానీ, 30 దేశాల్లోని 500
ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ కొనసాగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా
స్వామినాథన్ వ్యాఖ్యానించారు. తదుపరి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం..
మోనోక్లోనల్ యాంటీ బాడీలు, ఇమ్యునోమాడ్యులేటర్లు, గత కొన్ని నెలలుగా అభివృద్ధి చేసిన కొన్ని కొత్త యాంటీ వైరల్ ఔషధాలను
పరిశీలిస్తున్నామని అన్నారు.
0 Komentar