Engineering fees are fixed at a minimum
of Rs 35,000 and a maximum of Rs 82,000
ఇంజినీరింగ్ ఫీజుల ఖరారు - కనీసం రూ.35వేలు, గరిష్ఠం రూ.82వేలు
ఇంజినీరింగ్ బోధన రుసుముల కసరత్తు
కొలిక్కి వచ్చింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన
రుసుములను దాదాపు ఖరారు చేసింది. విశ్వవిద్యాలయాల నుంచి కళాశాలల అనుబంధ గుర్తింపు
జాబితా రాగానే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే జేఎన్‌టీయూ
కాకినాడ పరిధిలోని కళాశాలల జాబితాను సిద్ధం చేయగా.. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో
జాబితాకు రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. బోధన రుసుముల నిర్ణయం తర్వాత
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఐచ్ఛికాలు ప్రారంభం కానున్నాయి.
ఇంజినీరింగ్ కళాశాలలకు కనీస బోధన
రుసుము రూ.35వేలు ఉండనుంది. గరిష్ఠంగా రూ.82వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఒక
ప్రత్యేక కళాశాలకు రూ.90వేలు, మరోదానికి రూ.95వేలుగా
నిర్ణయించినట్లు తెలిసింది. గతేడాది గరిష్ఠంగా రూ.70వేలు ఉండగా.. దీన్ని కొంత
పెంచినట్లు సమాచారం. 2017-18 వరకు వర్సిటీలకు అనుబంధ గుర్తింపు ఫీజులు చెల్లించని
కళాశాలలపై చర్యలు తీసుకునే కసరత్తు కొనసాగుతూనే ఉంది. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో
125 కళాశాలలు ఉండగా.. ఇందులో 14 కళాశాలల్లో 25% లోపు ప్రవేశాలున్నాయి. వీటికి ఈ
ఏడాదికి అనుబంధ గుర్తింపు నిలిపివేయడమా? కోర్సులను
తగ్గించడమా? అనేదానిపై వర్సిటీ నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో సుమారు 55 కళాశాలలకు
ఎలాంటి బోధన రుసుమును నిర్ణయించే అవకాశం లేదు. వీటిలో ఈ ఏడాదికి ప్రవేశాలు
ఉండకపోవచ్చు. నాణ్యత ప్రమాణాలు పాటించని వాటికి సున్నా బోధన రుసుమును
నిర్ణయించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి 274
ప్రైవేటు కళాశాలలకు అనుమతులు మంజూరుచేసింది. విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు
నిలిపివేస్తే వీటి సంఖ్య 219కి చేరే అవకాశం ఉంది.
0 Komentar