Narayana Murthy wants coronavirus
vaccines at no cost to people, Disapproves WFH on permanent basis
ప్రజలందరికీ ఉచితంగా కరోనా
వ్యాక్సిన్.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాండిడేట్లు మెరుగైన పనితీరు కనబరుస్తుండటంతో.. త్వరలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
మోడెర్నా, ఫైజర్ తదితర ఫార్మా సంస్థలు రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఆశాజనకమైన పనితీరు కనబరుస్తున్నాయి. దీంతో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. కాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కోరారు.
‘‘అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా చేయించడమే ప్రజలకు మంచిది. ఈ భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్లను ఉచితంగా వేయించాలి. వ్యాక్సిన్లను ఉత్పత్తికయ్యే ఖర్చును ఐక్యరాజ్య సమితి లేదా దేశాలు చెల్లించాలి. ఈ సంస్థలు భారీ లాభాలు ఆశించొద్దు’’ అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ ధరలో ఎక్కువ మొత్తాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాలు భరించాలని మూర్తి సూచించారు. మోడెర్నా, ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్లను రెండు డోసుల్లో ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్క భారత ప్రజలకే దాదాపు 300 కోట్ల డోసులు అవసరం.
‘కరోనా వ్యాప్తిని
అరికట్టడం కోసం తాత్కాలికంగా ఇంట్లో నుంచి పని చేసుకునే వెసులుబాటు
కల్పిస్తున్నాం. కానీ మన దేశంలోని చాలా ఇళ్లు చిన్నవి కాబట్టి ఇంటి వద్ద పనిపై
శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది’ అని నారాయణ మూర్తి తెలిపారు. తగిన జాగ్రత్తలు
తీసుకొని స్కూళ్లను తిరిగి తెరవాలని ఆయన సూచించారు. దేశంలోని అనేక రంగాలు తిరిగి
పుంజుకుంటున్నాయన్నారు. దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలాలంటే ఏటా కోటి ఉద్యోగాల
చొప్పున వచ్చే 15-20 ఏళ్లపాటు ఉద్యోగాలను సృష్టించాలని.. ఇది
పెద్ద ఛాలెంజ్ అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.
0 Komentar