వైద్య కళాశాలల ప్రారంభానికి అనుమతి - డిసెంబరు 1 లోపే ప్రారంభించుకోవచ్చన్న కేంద్రం
కరోనా కారణంగా దాదాపు 8
నెలలుగా మూతపడిన వైద్య కళాశాలలు త్వరలోనే పునఃప్రారంభం కాబోతున్నాయి.
డిసెంబరు 1 నుంచి
లేదా ఆ లోపే వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా
ఊపింది. జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నవంబరు 25న వెల్లడించారు. వైద్య తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలను విడుదల చేశారు.
వైద్య కళాశాలల పునఃప్రారంభాన్ని ఆలస్యం చేస్తే.. ఐదేళ్ల వైద్యవిద్యను
పూర్తిచేసుకొని 2021-22 సంవత్సరంలో అందుబాటులో ఉండాల్సిన
దాదాపు 80 వేల మంది వైద్యుల సేవలు లభ్యంకావు. ఇది సమాజంపై
తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య కళాశాలలను సాధ్యమైనంత త్వరగా
పునఃప్రారంభించాలి అని ఎన్‌ఎంసీ సూచించింది.
రాష్ట్రంలో ఉన్నతస్థాయి సమీక్ష
అనంతరమే..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం
అన్ని సంవత్సరాల ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో
తరగతులు జరుగుతున్నాయి. అనుభవపూర్వక, ప్రయోగశాల శిక్షణ
తరగతులు మాత్రం నిర్వహించడంలేదు. కేంద్రం అనుమతుల నేపథ్యంలో వీటిని కూడా
ప్రారంభించడానికి అవసరమైన చర్యలపై త్వరలో ఉన్నతస్థాయిలో సమీక్ష సమావేశం
నిర్వహించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇతర రాష్ట్రాల విధానాలనూ పరిశీలించి
నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వెల్లడించాయి.
జాతీయ వైద్య కమిషన్ సిఫార్సులు
వైద్య తరగతులను సత్వరం
పునఃప్రారంభించాల్సిన ఆవశ్యకతను పేర్కొంటూ జాతీయ వైద్య కమిషన్ ఇటీవలే కేంద్ర
ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు లేఖ రాసింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది.
* కొవిడ్ ఉపద్రవం
చుట్టుముట్టడంతో ఎంబీబీఎస్ విద్యార్థులు గత 8 నెలలుగా
తరగతులకు హాజరు కావడం లేదు. అనుభవపూర్వక (క్లినికల్), ప్రయోగశాల(ల్యాబొరేటరీ)ల్లో
శిక్షణకు దూరమయ్యారు.
* 2020 సంవత్సరంలో
ఇంటర్నీలుగా చేరిన విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో అనుభవపూర్వక శిక్షణకు
నోచుకోలేకపోయారు. ఫలితంగా వీరు పీజీ-నీట్ పరీక్షకు అర్హత కోల్పోయే ప్రమాదముంది.
* అర్హులైన ఇంటర్నీలు లేని
కారణంగా 2021-22 సంవత్సరానికి నిర్వహించాల్సిన పీజీ-నీట్
పరీక్షలో జాప్యం జరుగుతోంది. వీరు ఎంత త్వరగా ఇంటర్న్‌షిప్‌ను
పూర్తిచేసుకోగలిగితే.. పీజీ నీట్ పరీక్షను అంత త్వరగా నిర్వహించడానికి మార్గం
సులువవుతుంది.
* ఈ ప్రభావం తర్వాత
రోజుల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో శిక్షణపైనా
పడుతుంది.
* ఇప్పటికే 2020-21 యూజీ వైద్యవిద్య సంవత్సరం 4 నెలలు ఆలస్యమైంది. ఈ
ఏడాది వైద్యవిద్య కోర్సుల్లోనూ త్వరితగతిన కౌన్సెలింగ్ పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాలి.
* కరోనా వంటి కఠిన సవాళ్లను
విద్యార్థి దశలోనే ఎదుర్కొనే అవకాశం రావడంతో వైద్యవిద్యార్థులు రాటుదేలుతారు.
నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇదొక అవకాశం. మున్ముందు మరింత సంక్లిష్ట సవాళ్లు
ఎదురైనా ఆ ఒత్తిడిని తట్టుకొని సమర్థంగా నైపుణ్యమైన వైద్యసేవలందించడానికి ప్రస్తుత
పరిస్థితులు దోహదపడతాయి.
* 2020-21లో ఆలస్యమైన నూతన
వైద్యవిద్య తరగతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం ఫిబ్రవరి 1, 2021 నుంచి ప్రారంభించాలి. 2020-21 పీజీ వైద్యవిద్య
తరగతులను కనీసం జులై 1, 2021 నుంచి మొదలుపెట్టాలి. తద్వారా 2021-22 పీజీ నీట్ పరీక్షను మార్చి-ఏప్రిల్ 2021లో
నిర్వహించడానికి వీలుకలుగుతుంది.
* పూర్తిస్థాయి కొవిడ్
ఆసుపత్రులుగా ఉన్న బోధనాసుపత్రుల్లో తిరిగి కొవిడేతర సేవలను వెంటనే ప్రారంభించాలి.
సాధారణ రోగులకు కూడా తగినన్ని పడకలు కేటాయించాలి.
0 Komentar