డిఫెన్ఫెక్షన్ టన్నెళ్లను నెల
రోజుల్లోగా నిషేధించండి
మనుషులపై క్రిమి సంహారకాలా...? కేంద్రానికి
సుప్రీంకోర్టు ఆదేశం
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి
చాలా ప్రాంతాల్లో క్రిమిసంహారక టన్నెళ్లు ద్వారా మనుషులపై రసాయనాలు చల్లడం మీద
సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. వీటివల్ల మనుషులకు హాని కలిగే ప్రమాదం
ఉన్నందున తక్షణం కేంద్రం జోక్యం చేసుకొని డిస్ఇన్ ఫెక్షన్ టన్నెళ్లు, కృత్రిమంగా
అతినీలలోహిత (యూవీ) కిరణాలు ప్రసరింపజేసే యంత్రాల వినియోగాన్ని నిషేధిస్తూ/
నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ అశోకభూషణ్,
జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్
ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. బహిరంగ స్థలాల్లో
ఇలాంటి టన్నెళ్లు ఏర్పాటుచేసి రసాయనాలు చల్లడాన్ని సవాల్ చేస్తూ గురుసిమ్రన్ సింగ్
నరులా అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టన్నెళ్ల ద్వారా చల్లే రసాయనాలతో
వైరస్ వ్యాప్తి జరగదన్నది అపోహ మాత్రమేనని, రాజ్యాంగంలో
పొందుపరిచిన జీవించే హక్కును దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
అనుమతించకూడదని ఆయన కోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం
నుంచి సమాధానం కోరగా మనుషులపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకూడదని, అలాంటి వాటిని సిఫార్సు చేయకూడదని ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసినట్లు
కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తక్షణం వాటిని పూర్తిగా
నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది.
నియంత్రణ ఉండాల్సిందే
"మనుషుల శరీరంపై
క్రిమిసంహారకాలు చల్లడం, అతినీలలోహిత కిరణాలు ప్రసరింపజేయడంపై
నియంత్రణ ఉండాలన్నది మా అభిప్రాయం. వాటిని ఉపయోగించడానికి సిఫార్సు చేయడం లేదని
కేంద్రమే చెబుతోంది. కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. మనుషులపై క్రిమిసంహారక రసాయనాలు చల్లడం ఆరోగ్యంపై
ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో దాన్ని సరిదిద్దడానికి తక్షణం
దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నెలరోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఉపశమన చర్యలు తీసుకున్నాయి. క్రిమిసంహారకాల
పిచికారీకి సిఫార్సు చేయట్లేదని చెప్పడం వరకే పరిమితం కాకుండా మరిన్ని చర్యలు
తీసుకొని ఉండాల్సింది. మనుషులపై పిచికారీ చేస్తున్న రసాయన సేంద్రియ
క్రిమిసంహారకాల వల్ల మనుషులకు హాని కలగవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి"
అని ధర్మాసనం గుర్తు చేసింది.
0 Komentar