TS: 14,300 Applications for MBBS and BDS
వైద్యవిద్యకు 14,300 దరఖాస్తులు
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 2020-21 సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య అభ్యసించేందుకు మొత్తం 14,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 8తో దరఖాస్తులకు గడువు ముగిసిపోవడంతో.. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మరో 7 రోజులపాటు కొనసాగే అవకాశాలున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించడంతో పాటు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
తొలి విడత ప్రవేశాలు పూర్తయిన అనంతరం యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అఖిల భారత కోటాలోనూ ఎయిమ్స్, జిప్‌మర్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల గడువును పెంచారు. అఖిల భారత కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 14 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉండగా.. మరో రెండు రోజుల పాటు పెంచుతూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయం తీసుకొంది. రెండో విడత ప్రవేశాలు 18న ప్రారంభం కానుండగా.. 25న సీట్ల కేటాయింపు సమాచారం ప్రకటిస్తారు.
0 Komentar