Tungabhadra Pushkaralu to begin from today in Telugu States
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో
తుంగభద్ర పుష్కరాలు
ఆంధ్రప్రదేశ్
తుంగభద్ర పుష్కరాలు నేటి నుంచి
ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి
నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్
కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు.
కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో తుంగభద్ర నది పరివాహక
ప్రాంతంలోమొత్తం 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం
6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది.
కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. మరోవైపు కరోనా ప్రభావం నేపథ్యంలో భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. వెబ్‌సైట్ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్‌లలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
తెలంగాణ
మరోవైపు తుంగభద్ర నది పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్రం సైతం ఏర్పాట్లు పూర్తి చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్, వేణిసోంపురం, రాజోలి, పుల్లూరు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను సిద్ధంచేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.21 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్ఠాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీలు పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇతర ప్రముఖులు పాల్గొనున్నారు.
ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకే పుష్కరాలకు అనుమతి ఇచ్చారు. పదేండ్లలోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏండ్లు దాటినవారికి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగెటివ్ వచ్చినట్టు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. కరోనా టెస్ట్ రిపోర్టు తీసుకురాని భక్తులకు థర్మల్ టెంపరేచర్ స్క్రీనింగ్‌చేసి జ్వర లక్షణాలు లేనట్టు నిర్ధారణ అయితేనే అనుమతిస్తారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పుష్కరాల వద్ద కల్పించిన ఏర్పాట్లు, విధానాలను భక్తులు పాటించాలని అధికారులు సూచించారు.
0 Komentar