Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Uniform National Entrance Exam in Nursing Like NEET

 


Uniform National Entrance Exam in Nursing Like NEET

‘నీట్‌’లాగే నర్సింగ్‌కూ ప్రవేశ పరీక్ష

కేంద్రం కీలక నిర్ణయం.. ముసాయిదా విడుదల

ఏఎన్‌ఎంలకు ఇక నుంచి ‘నర్స్‌ అసోసియేట్‌’ హోదా 

మెడికల్‌ అడ్మిషన్లకు ‘నీట్‌’ ఎలాగో నర్సింగ్‌ ప్రవేశాలకూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (యూనిఫామ్‌ ఎంట్రీ ఎగ్జామ్‌) రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న జాతీయ నర్సింగ్‌ కౌన్సిల్‌ స్థానంలో కొత్తగా ‘నేషనల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్‌ (ఎన్‌ఎన్‌ఎంసీ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 6నాటికి దేశవ్యాప్తంగా అభిప్రాయాలు కోరింది. నర్సింగ్‌ విద్య, వృత్తిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్దేందుకు బిల్లులో అనేక అంశాలను చేర్చారు. ప్రస్తుత నర్సింగ్‌ వ్యవస్థను సమూలంగా మార్చాలన్నదే దీని ఉద్దేశమని నర్సింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పటివరకు బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలంటే ఇంటర్‌ బైపీసీ అర్హతగా ఉంది. ఓపెన్‌ కేటగిరీలో 45%, రిజర్వేషన్‌ కేటగిరీలో 40% మార్కులు సాధించిన వారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకోవాలి. మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక ఎంఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరాలంటే బీఎస్సీ నర్సింగ్‌ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఏడాదిపాటు ఎక్కడో ఒకచోట పనిచేసిన అనుభవం ఉండాలి. అలాంటివారికి వారి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 2014కు ముందు ఎంఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు ఎంట్రన్స్‌ నిర్వహించేవారు. తదనంతరం దాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం దేశంలో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరడానికి మార్కులే అర్హత. 

నర్సింగ్‌ కోర్సు పూర్తయ్యాక రాష్ట్రాల్లోని నర్సింగ్‌ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నర్సులుగా చేరేవారు. ఇకపై నర్సింగ్‌ వృత్తి చేపట్టడం అంత సులువు కాదు. నర్సింగ్‌ విద్యలో నాణ్యతను పెంచడానికి కొత్తగా జాతీయస్థాయిలో నీట్‌ తరహా ఎంట్రన్స్‌ పెడతారు. దానిని ‘యూనిఫామ్‌ ఎంట్రీ ఎగ్జామ్‌’గా పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించినవారు జాతీయ, రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక నర్సింగ్‌ కోర్సు పూర్తయినవారికి మళ్లీ నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. అందులో పాసైన వారే నర్సింగ్‌ వృత్తి చేపట్టడానికి లేదా ఎంఎస్సీ కోర్సులో చేరడానికి అర్హులు. 

ముసాయిదాలోని మరికొన్ని అంశాలు

నర్సింగ్‌ కోర్సు సిలబస్‌ ఆలిండియా స్థాయిలో ఆంగ్లంలో ఒకటే ఉంటుంది.

కాలేజీల్లో నర్సింగ్‌ విద్యా ప్రమాణాలను పెంచాలి. నైపుణ్యం, విజ్ఞానం, ప్రవర్తన, విలువలు, నైతికత, హెల్త్‌కేర్, పరిశోధన వంటివి నేర్పించాలి. పోటీతత్వం పెంచాలి.

అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నర్సింగ్‌ విద్యాసంస్థలను తీర్చిదిద్దేలా మార్గదర్శకాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, మంచి ఫ్యాకల్టీని కల్పించడం ద్వారా నాణ్యతను పెంచాలి.

అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్‌ ఫ్యాకల్టీకి శిక్షణనివ్వాలి.

కమిషన్‌ అమల్లోకి వచ్చిన తరువాత మూడేళ్లలోపునే జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. బిల్లు పాసైన ఐదేళ్లలో నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ అమలుచేస్తారు.

జాతీయస్థాయి రిజిస్ట్రేషన్‌

నర్సింగ్‌ కోర్సు ఏ రాష్ట్రంలో చదివినవారు ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నది ప్రస్తుత నిబంధన. కానీ కొత్త కమిషన్‌లో కీలకమార్పు చేశారు. నేషనల్‌ పోర్టల్‌లో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. కాలేజీల్లో తనిఖీలు కఠినంగా ఉంటాయి. థర్డ్‌ పార్టీకి తనిఖీల బాధ్యత అప్పగిస్తారు. తనిఖీ వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. ఏఎన్‌ఎంలు ఇకపై ‘నర్స్‌ అసోసియేట్‌’గా కొత్త హోదా పొందుతారు. లేడీ హెల్త్‌ వర్కర్స్, మేల్‌ హెల్త్‌ వర్కర్లను కూడా నర్స్‌ అసోసియేట్‌గానే పిలుస్తారు. 

నాలుగు మండళ్ల ఏర్పాటు

ఎన్‌ఎన్‌ఎంసీ పరిధిలో కొత్తగా నర్సింగ్‌–మిడ్‌ వైఫరీ యూజీ ఎడ్యుకేషన్‌ బోర్డు, నర్సింగ్‌– మిడ్‌వైఫరీ పీజీ ఎడ్యుకేషన్‌ బోర్డు, నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ అసెస్‌మెంట్‌–రేటింగ్‌ బోర్డు, నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఎన్‌ఎంసీకి చైర్‌పర్సన్, నర్సింగ్‌ అడ్వైజరీలు, సభ్యులు ఉంటారు. వీరిలో ఎయిమ్స్‌ వంటి సంస్థలు, ఆసుపత్రుల్లో పనిచేసే సూపరింటెండెంట్లు ఉంటారు. 12 మంది నిపుణుల్లో నర్సులు ఉంటారు. మిడ్‌వైఫరీ నుంచి, ఎన్‌జీవో నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఒకరు మెడికల్‌ లా తెలిసినవారు సభ్యులుగా ఉంటారు. సెర్చ్, సెలక్షన్‌ కమిటీలో ఆఫీస్‌ బేరర్లను నియమిస్తారు. చైర్మన్, సభ్యులు నాలుగేళ్లకోసారి మారతారు. చైర్మన్, సభ్యులు ఆస్తులు ముందే ప్రకటించాలి.

ప్రస్తుత నర్సింగ్‌ కౌన్సిల్‌ స్థానే నేషనల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్‌ను తీసుకురావడం వల్ల నర్సింగ్‌ విద్యలో సమూల మార్పు లొస్తాయి. జాతీయస్థాయి పరీక్ష, ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ల వల్ల నర్సింగ్‌ వృత్తి, విద్యలో ప్రమాణాలు, నాణ్యత పెరుగుతాయి. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags