5.31 Lakh Posts in State Police Forces 1.27 Lakh in CAPFS lying Vacant: BPRD
దేశవ్యాప్తంగా 5.31 లక్షల పోలీసు ఉద్యోగాలు ఖాళీ.. తెలుగు రాష్ట్రాల్లో 43,833 ఖాళీలు
దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో దాదాపు 5.31లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో 43833 ఖాళీలు
ఏపీలో 14,341.. తెలంగాణలో 29,492 ఖాళీలు
కేంద్ర హోంశాఖ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో దాదాపు 5.31లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాల్లో (సీఏపీఎఫ్) సుమారు 1.27లక్షల ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) డిసెంబరు 29న ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది.
బీపీఆర్‌డీ నివేదికలోని
ముఖ్యాంశాలు:
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 26.23 లక్షల పోలీసు ఉద్యోగాలు మంజూరు చేయగా.. 2020, జనవరి 1 నాటికి ప్రస్తుతం 20.90లక్షల మంది విధుల్లో ఉన్నారు. ఇంకా 5.31లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు 11.9 లక్షల పోస్టులు మంజూరు చేయగా.. 2020 జనవరి 1 నాటికి 9.82 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.
ఇంకా 1.27 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా 2019లో దేశవ్యాప్తంగా వివిధ పోలీసు శాఖల్లో మొత్తం 1.19లక్షల నియామకాలు జరిగాయి. కాగా దేశవ్యాప్తంగా 2.15లక్షల మంది మహిళా పోలీసులు ఉన్నట్లు బీపీఆర్‌డీ తెలిపింది.
ఏపీలో 14,341 ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్‌లో 14,341 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బీపీఆర్‌డీ వెల్లడించింది. రాష్ట్రానికి 73,894 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 59,553 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోలీసుల్లో మహిళలు 5.85% మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలను బట్టిచూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి లక్ష మందిని 85 మంది పోలీసులు పర్యవేక్షించాల్సి వస్తోంది.
తెలంగాణలో 29,492 ఖాళీలు:
తెలంగాణలో 29,492 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బీపీఆర్‌డీ నివేదించింది. రాష్ట్రానికి 78,369 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 48,877 మంది
మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా 29,492 పోస్టులు
ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం.. తెలంగాణలో పోలీసుల
సంఖ్య మధ్య స్థాయిలో ఉంది.
0 Komentar