కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటే
ప్రవేశపరీక్ష
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
ఏటా ఆన్‌లైన్‌లో రెండుసార్లు నిర్వహించే అవకాశం
ఒక దేశం- ఒక పరీక్ష లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒక్కటే ప్రవేశపరీక్ష నిర్వహించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా.. అందులో 14 కొత్త వర్సిటీలు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ సీట్ల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీయూసెట్) పేరిట ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నాయి. మిగిలిన విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ప్రవేశపరీక్షలు జరుపుకొంటున్నాయి. జాతీయ నూతన విద్యావిధానంలో వర్సిటీ ప్రవేశపరీక్షలను సరళతరం చేయాలని, దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష జరపాలని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారతీయ వాణిజ్యం, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) సదస్సులో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ), ఉర్దూ విశ్వవిద్యాలయాలూ ఉమ్మడి ప్రవేశపరీక్షలో భాగం కానున్నాయి. ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో ఏటా రెండుసార్లు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. జాతీయ పరీక్షల నిర్వహణ మండలి(ఎన్‌టీఏ)కు పరీక్షల బాధ్యతను అప్పగించనున్నారు. ఈ సంస్థ ఇప్పటికే దిల్లీ, జేఎన్‌యూ తదితర వర్సిటీల ప్రవేశాలకు ఆన్‌లైన్ ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అయితే ఒకే పరీక్ష గురించి ఇప్పటివరకు సమాచారం అందలేదని హెచ్‌సీయూ ఉపకులపతి అప్పారావు తెలిపారు. ఒకటే పరీక్ష వల్ల ర్యాంకులను బట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏ వర్సిటీలోనైనా చదివే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ల బదిలీ వచ్చే ఏడాది
నుంచే..
జాతీయ నూతన విద్యావిధానంలో విద్యార్థులకు పలు వెసులుబాట్లు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా లాంటి దేశాల తరహాలో ఒక వర్సిటీ నుంచి మరోదానికి మారినా అప్పటివరకు చదివిన విశ్వవిద్యాలయంలో సాధించిన క్రెడిట్లను బదిలీ చేయడాన్ని కూడా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. అవసరమైతే సెమిస్టర్ ముగిసిన తర్వాత మానుకొని.. తర్వాత ఎప్పుడైనా చేరటం లాంటివి కూడా 2021-22 విద్యాసంవత్సరం నుంచే అమలవుతాయి.
0 Komentar