Covid-19 pandemic could push over 1
billion in extreme poverty by 2030: UN
2030నాటికి.. 100కోట్ల మంది పేదరికంలో..అంచనా వేసిన ఐరాస అభివృద్ధి కార్యక్రమం
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా మరో 20కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వారితో కలిపి 2030 నాటికి దాదాపు మొత్తం 100కోట్ల మంది కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే దశాబ్ద కాలంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై యూఎన్‌డీపీ తాజాగా అంచనాలు వేసింది. ఇందుకోసం యూఎన్‌డీపీతో పాటు యూనివర్సిటీ డెన్వెర్ భాగస్వామ్యంలో ఓ అధ్యయనాన్ని చేపట్టాయి.
కరోనా కన్నా ముందు పరిస్థితుల ప్రకారం, 2030 నాటికి 4కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదికలు వెల్లడైంచాయి. అయితే, అవి ప్రస్తుత మరణాల రేటు, ఇటీవలి అభివృద్ధి అంచనాల ప్రకారం వాటిని అంచనా వేశారు. కానీ, కరోనా పరిస్థితులతో ఆ అంచనాలన్నీ మారిపోయాయి. ప్రస్తుతం కరోనాను ప్రామాణికంగా తీసుకొని చూస్తే మాత్రం రానున్నరోజుల్లో వీటి ప్రభావం ఎక్కువగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మరణాల నష్టం ఎక్కువగా ఉండి, కరోనా తీవ్రత నుంచి కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పడితే మాత్రం 2030 నాటికి మరో 20కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళతారని యూఎన్‌డీపీ నివేదించింది. అంతేకాకుండా తీవ్ర నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే, కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం మరో పదేళ్లపాటు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు వచ్చే పదేళ్లపాటు సామాజిక భద్రత/సంక్షేమ కార్యక్రమాలు, డిజిటలీకరణ, ప్రభుత్వ పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరాన్ని తాజా నివేదిక గుర్తుచేసింది. తద్వారా కరోనా కంటే ముందు పరిస్థితులను సాధ్యమైనంత తొందరగా చేరుకునే అవకాశాలు ఉండడంతో పాటు తీవ్ర పేదరికం నుంచి బయటపడవచ్చని యూఎన్‌డీపీ సూచించింది.
కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని
సృష్టించినప్పటికీ.. సుస్థిరాభివృద్ధి సాధనకు నూతన విధానంలో ముందుకెళ్లేందుకు మరో
అవకాశాన్ని కల్పించిందని యూఎన్‌డీపీ పేర్కొంది. దీంతో ప్రజలు మెరుగైన, ఉజ్వల
భవిష్యత్తును తిరిగి ప్రారంభించేందుకు దోహదపడుతుందని యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్
ఆచిమ్ స్టెయినర్ అభిప్రాయపడ్డారు.
0 Komentar