Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India Gear Up for Covid Vaccine Rollout, Dry Run to Be Conducted In 4 States

 

India Gear Up for Covid Vaccine Rollout, Dry Run to Be Conducted In 4 States

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో 28 నుంచి డ్రై రన్ 

దేశంలో అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించనుంది. ఏపీ, గుజరాత్, పంజాబ్, అసోం రాష్ట్రాల్లో ఈ రిహార్సల్ నిర్వహించనున్నారు.

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించనుంది. నాలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద టీకా సన్నాహక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం (డిసెంబర్ 25) ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ రిహార్సల్ కార్యక్రమంగా పేర్కొంటున్న ఈ ‘డ్రై రన్‌’ను ఆంధ్రప్రదేశ్ సహా పంజాబ్‌, అసోం, గుజరాత్‌ రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఈ 4 రాష్ట్రాల నుంచి రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేశారు. 

వ్యాక్సిన్ వాస్తవ పంపిణీలో సమస్యల గుర్తింపే లక్ష్యంగా ఈ డ్రై రన్‌ను నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వటం ఒకటే తక్కువ. మిగిలిన అన్ని దశలను పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో డ్రై రన్ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. 

టీకా ఇచ్చే క్రమంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, వ్యాక్సిన్ అనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విషయంలో ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకుంటారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలిస్తారు. 

వీటితో పాటు కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అదుపు చేసే విధానం అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్ ఇచ్చే ఇతర సిబ్బంది పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు అందజేసింది. 

తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా దీన్ని ట్రాక్ చేస్తారు. మొదట ఆరోగ్య సిబ్బందికి, 50 ఏళ్ల పైబడిన వారికి టీకా అందించనున్నారు. ఆరోగ్య సిబ్బంది సుమారు ఒక కోటి మంది, ఇతర కరోనా యోధులు రెండు కోట్ల మంది, నిర్దేశిత వయోపరిమితిలో ఉన్నవారు 27 కోట్ల మంది ఉన్నట్లు ఇప్పటికే కేంద్రం గణాంకాలు సేకరించింది. 

వ్యాక్సినేటర్లకు కొనసాగుతున్న శిక్షణ

కరోనా వ్యాక్సిన్ ఇచ్చే వారికి దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2360 సెషన్లలో, 7000 మంది ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. పూర్తి వ్యాక్సిన్ ప్రక్రియను నిర్వహించడం, కొవిన్‌ ‌పోర్టల్‌ను ఉపయోగించడంలో వీరికి శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు కరోనా వ్యాక్సిన్‌‌కు సంబంధించి కొవిన్‌ పోర్టల్‌‌లో బాధితులు అడిగే సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు 1075, 104 హెల్ప్‌లైన్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. జనవరి మొదటి వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags