ఆర్జీయూకేటీ సెట్ ఫలితాల విడుదల –
జనవరి లో కౌన్సెల్లింగ్ మరియు తరగతుల ప్రారంభం
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చేందుకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లు కలపనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ట్రిపుల్‌ఐటీలు, వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్జీయూకేటీ సెట్)ఫలితాలను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను గ్రేడు పాయింట్లుగా మార్పు చేసి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 0.4 పాయింట్లు కలపనున్నట్లు వెల్లడించారు. త్వరలో జనరల్, రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులు, కాల్ లెటర్లను విద్యార్థులకు పంపిస్తామని, కౌన్సెలింగ్ సమాచారం అందిస్తామని చెప్పారు. పూర్తి వివరాలను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
జనవరి నుంచి తరగతులు
ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జనవరి 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని, 18 నుంచి తరగతులు జరుగుతాయని మంత్రి సురేష్ తెలిపారు. ప్రాథమిక ‘కీ’పై 1900 అభ్యంతరాలు రాగా రెండింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. గణితం, భౌతికశాస్త్రంలో రెండు మార్కులు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్జీయూకేటీ సెట్‌కు తెలంగాణ, ఏపీలో కలిపి 88,974మంది దరఖాస్తు చేయగా.. 85,755 మంది పరీక్షకు హాజరయ్యారు. 15శాతం స్థానికేతర కోటా కింద తెలంగాణకు చెందిన వారికి ప్రవేశాలు కల్పించనున్నారు. గుంటూరు జిల్లా ఏపీ ఆదర్శ పాఠశాలకు చెందిన గుర్రం వంశీకృష్ణ మొదటి ర్యాంకు సాధించగా.. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రైవేటు పాఠశాలకు చెందిన పోతుగంటి జాకీర్ హుసేన్ రెండో ర్యాంకు సాధించారు.
ఈడబ్ల్యూఎస్ కోటా అదనం..
ఇడుపులపాయ, నూజివీడు,
ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4 వేల సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10శాతం సీట్లు పెంచనున్నారు. ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర
రాష్ట్రాలు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 2శాతం
సీట్లు ఉంటాయి.
అత్యధిక మార్కులు సాధించిన
విద్యార్థులు
ఏపీలో 165మంది, తెలంగాణలో ఇద్దరు విద్యార్థులు వందకు 90కంటే ఎక్కువ మార్కులు సాధించారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 1,475 మందికి 81-90 మధ్య మార్కులు రాగా.. 3,195 మందికి 71-80 మధ్య మార్కులు వచ్చాయి
0 Komentar