టిఎస్: సమీప కళాశాలలోనే సెమిస్టర్ పరీక్షలు - విద్యార్థులకు జేఎన్‌టీయూ వెసులుబాటు
విద్యార్థులు సొంతూరికి చేరువలోని కళాశాలలో రెండో సెమిస్టర్ పరీక్షలను రాసేందుకు జేఎన్‌టీయూ అనుమతించింది. ఈ మేరకు వారు సమీపంలోని మూడు కళాశాలల కోసం ఐచ్ఛికాలను సంబంధిత ప్రిన్సిపల్‌కు సమర్పించాలని, ఇందులో ఒకటి తప్పక వర్సిటీ గుర్తింపు కలిగిన బీటెక్ లేదా బీఫార్మసీ కళాశాల అయి ఉండాలని సూచించింది. విద్యార్థులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఒక కళాశాలను ఎంపిక చేసి పరీక్ష కేంద్రంగా కేటాయించాల్సిన బాధ్యత సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌పై ఉంటుంది. అనంతరం విద్యార్థి ఎంచుకున్న కళాశాలను సంప్రదించి పరీక్ష రాసేందుకు వీలు కల్పించేలా చొరవ తీసుకోవాలి. ఎవరైనా విద్యార్థి ఐచ్ఛికం సమర్పించకపోతే, పేరెంట్(చదివే) కళాశాలలో పరీక్ష రాస్తున్నట్లుగా అధికారులు గుర్తించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రం తాము చదివే కళాశాలలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వారి కోసం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కళాశాల యాజమాన్యం వసతిగృహ సదుపాయం కల్పించాలి. రెండో సెమిస్టర్ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
నిబంధనలు పాటించాల్సిందే..
సొంతూరికి దగ్గర్లోని కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు వర్సిటీ వెసులుబాటు కల్పించినా, కొన్ని కళాశాలలు పట్టించుకోవడం లేదు. చదివే కళాశాలలో పరీక్ష రాయాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ స్పందించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కచ్చితంగా ఐచ్ఛికాలు ఇచ్చి సొంతూరికి సమీప కళాశాలలోనే పరీక్ష రాసే వీలు కల్పించాలని అన్ని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించారు.
పరీక్ష సమయం కుదింపు
కొవిడ్ నేపథ్యంలో సెమిస్టర్
పరీక్షల సమయాన్ని జేఎన్‌టీయూ కుదించింది. సెప్టెంబరు, అక్టోబరులో పరీక్షను అప్పట్లో రెండు గంటలు నిర్వహించగా,
తాజాగా రెండో సెమిస్టర్ పరీక్షలను 80
నిమిషాలకే పరిమితం చేసింది.
0 Komentar