SSC Examination Papers May Reduced to Six in Telangana
టెన్త్ పరీక్షలు ఆరుకు తగ్గింపు - కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
కరోనా కారణంగా పదో తరగతిలో 70
శాతం మేర సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని నైపుణ్య కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక వార్షిక పరీక్షలను
కూడా 11 నుంచి ఆరుకు తగ్గించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు
చేస్తున్నారు. పరీక్ష సమయాన్ని కూడా రెండున్నర గంటలకు బదులుగా గంటన్నర మాత్రమే
నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్ల చొప్పున,
సెకండ్ లాంగ్వేజీకి ఒక పేపర్ చొప్పున మొత్తం 11 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సబ్జెక్టుకు ఒక పేపరు
చొప్పున మొత్తం ఆరు పరీక్షలే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే
ప్రశ్నపత్రంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నలు ఎక్కువగా
ఇచ్చి వాటిలో సమాధానాలు రాసేందుకు ఆప్షన్లు కూడా ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనలో
విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. ప్రశ్నలు వ్యాసం రూపంలో సాధ్యం కాకపోతే ఆబ్జెక్టివ్
విధానంలో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రశ్నపత్రం
రూపొందించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి లాంటి అరుదైన పరిస్థితుల నేపథ్యంలో
ఇలాంటి మార్పులు అనివార్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు.
1-9 వరకు పరీక్షలు
అనివార్యమే
ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడో
తరగతి నుంచి పదో తరగతి వరకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో
క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల విద్యార్థులకు కూడా వార్షిక పరీక్షలను
ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నెలవారీ, ఆరు నెలల పరీక్షలను రద్దు చేశారు. వీటన్నింటినీ క్రోడీకరించి, ఒక గ్రాండ్
టెస్ట్ రూపొందించి, ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా
పై తరగతులకు ప్రమోట్ చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు తయారు చేసిన
ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కసరత్తు కొనసాగిస్తున్నారు.
త్వరలో సీఎం కేసీఆర్ నిర్వహించే విద్యాశాఖ సమీక్ష సమావేశంలో తుది నిర్ణయాలు
వెలువడే అవకాశాలు ఉన్నాయి.
0 Komentar