టిఎస్: ఈ విద్యా సంవత్సరం ఐదో
తరగతి వరకు బడుల్లేవు - విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం
ఈసారికి ప్రాథమిక పాఠశాలలు
తెరుచుకోనట్లే
వచ్చే విద్యాసంవత్సరంలో వారిని పైతరగతులకు పంపే అవకాశం
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2020-21) 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంటే, ఈసారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్లే. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలుస్తోంది. కరోనా టీకా ఇంకా అందుబాటులోకి రాకపోవడం.. కొత్త స్ట్రెయిన్ భయం తదితర కారణాలతో తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పాఠశాలలు తెరిచినా.. పిల్లలు భౌతికదూరం పాటించే పరిస్థితి ఉండదని, ఒకవేళ వారు కొవిడ్ బారిన పడితే తల్లిదండ్రులు, ఇళ్లలోని వృద్ధులకు ప్రమాదం ఉండొచ్చని అధికారుల అంచనా. అందుకే 5వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది బోధన వద్దని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. నవంబరు 10న విద్యాశాఖ విభాగాధిపతులతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతుల విద్యార్థులు 11.36 లక్షల మంది, ప్రైవేటులో దాదాపు 15 లక్షల మంది ఉంటారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వారు ఆరేడు లక్షల మంది ఉంటారని అంచనా. వారందరికీ ఈ విద్యా సంవత్సరం బడులు ఉండనట్లే. వచ్చే విద్యాసంవత్సరంలో వారిని పైతరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అయితే 9, 10 తరగతులకు కచ్చితంగా కనీసం 90-120 రోజులు తరగతి గది బోధన అందించాలన్నది లక్ష్యం. 6-8 తరగతులకు మాత్రం కరోనా పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన అందిస్తారు.
సంక్రాంతి తర్వాతే కళాశాలలు..
9, 10, ఇంటర్‌కు తరగతి బోధన తొలుత డిసెంబరు 1 నుంచి ప్రారంభించాలనుకున్నారు. కానీ, అది అమలు కాలేదు. సంక్రాంతి సెలవుల తర్వాత 9, 10 తరగతులకు బడులు తెరిచి ప్రత్యక్ష పాఠాలు అందించాలన్నది తాజాగా ప్రభుత్వ ప్రణాళిక. ఇంటర్, డిగ్రీ తరగతులను జనవరి 2వ తేదీ నుంచి మొదలుపెట్టాలని ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల పునఃప్రారంభం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీకి తరగతి బోధన సంక్రాంతి తర్వాతే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
0 Komentar