Air India's All-Women Pilot Team
Successfully Completes Longest Direct Route
16 వేల కి.మీ ఎగిరొచ్చిన నారీశక్తి! అరుదైన ఘనత సాధించిన ఎయిరిండియా మహిళా పైలట్లు
ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనత సాధించారు. అత్యంత సుదూరం ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగొచ్చారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 16,000 కి.మీ దూరం ప్రయాణం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నలుగురు పైలట్లు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు మేం ప్రపంచ రికార్డు నెలకొల్పాం. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా.. అంతా మహిళా పైలట్లే ఈ సాహసాన్ని పూర్తి చేయడం విశేషం. చాలా ఆనందంగా ఉంది. ఈ మార్గం ద్వారా రావడం వల్ల మేం 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగాం’’ అని నలుగురు పైలట్లలో ఒకరైన కెప్టెన్ జోయా అగర్వాల్ తెలిపారు. ఈ బృందంలో మన తెలుగమ్మాయి పాపగారి తన్మయి కూడా ఉండడం విశేషం.
మహిళా పైలట్లు ఈ ఘనత సాధించడం పట్ల
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరీ సైతం హర్షం వ్యక్తం చేశారు.
ఎయిరిండియాకు చెందిన మహిళల సత్తా ప్రపంచం నలుమూలలా చేరిందని వ్యాఖ్యానించారు.
అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా మహిళా పైలట్లు తమ ప్రయాణాన్ని
కొనసాగించారు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, అపారమైన అనుభవం ఉన్న
పైలట్లకు మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశాన్ని ఈసారి మన ఎయిరిండియాకు చెందిన మహిళా
బృందం సొంతం చేసుకోవడం విశేషం. విరామం లేకుండా 16వేల కి.మీ
ప్రయాణించి తమ నారీశక్తిని చాటారు. పైగా ప్రపంచలోనే రెండో పొడవాటి బోయింగ్
విమానాన్ని నడపడం కూడా ఇదే తొలిసారి. 17 గంటల్లో వారు తమ
ప్రయాణాన్ని పూర్తి చేశారు. భౌగోళికంగా బెంగళూరుకు ఆవలివైపు శాన్‌ఫ్రాన్సిస్కో
ఉంది. ఉత్తరధ్రువం మీదుగా ప్రయాణించడం వల్ల సమయం, ఇధనం ఆదా
చేయడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడానికి ఇలాంటి ప్రయాణాలు సహకరిస్తుంటాయి.
0 Komentar