టిఎస్: తరగతి గదిలో 50 శాతానికే అనుమతి - డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల్లో వర్తింపు - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ
తేదీ నుంచి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభమవుతున్నందున డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యాకోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యాశాఖ
అధికారులతో జనవరి 29న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ,
ప్రైవేటు విద్యాసంస్థలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను మంత్రి
ఆదేశించారు. ప్రతి కళాశాల యాజమాన్యం తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను
రూపొందించి అమలు చేసేలా చూడాలన్నారు. రోజూ శానిటైజేషన్ చేపట్టేందుకు ప్రతి
విశ్వవిద్యాలయానికి రూ.20 లక్షలు తక్షణ సాయంగా అందించాలని
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు. సమావేశంలో ఉన్నత,
సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యామండలి
కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అనంతరం ఛైర్మన్ పాపిరెడ్డి
మాట్లాడుతూ డిగ్రీలో ఒక సెక్షన్‌కు 50/60 మంది ఉంటారని,
అందులో సగం మందిని అనుమతించి విద్యాబోధన చేయవచ్చని చెప్పారు. ఉదయం
బీఏ, బీఎస్‌సీ, మధ్యాహ్నం నుంచి బీకాం
విద్యార్థులను అనుమతించుకోవచ్చని, లేకుంటే ఉదయం చివరి ఏడాది
వారు, మధ్యాహ్నం ప్రథమ, ద్వితీయ
సంవత్సర విద్యార్థులను రప్పించుకోవచ్చని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో కూడా
హాస్టళ్లను తెరుస్తామని పాపిరెడ్డి చెప్పారు.
0 Komentar