పాత పద్ధతిలోనే ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు - జేఎన్‌టీయూ కీలక నిర్ణయం
ఇకపై ఇంజినీరింగ్ సెమిస్టర్
పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో
అన్ని అనుబంధ కళాశాలలకు ఆదేశాలు ఇవ్వనుంది. ఫిబ్రవరి 1
నుంచి తరగతి గది బోధన చేపడుతున్న నేపథ్యంలో పరీక్షల విషయంలో వెసులుబాటు కల్పించాల్సిన
అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. కరోనా కారణంగా గత విద్యా సంవత్సరానికి
సంబంధించిన సెమిస్టర్ పరీక్షల విషయంలో యూజీసీ నిబంధనల ప్రకారం సమయం రెండు గంటలకు
కుదించడం, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం వంటి
అవకాశాలు ఇచ్చింది. ఈ సారి ఇలాంటివి ఎక్కువగా ఇచ్చినప్పటికీ, పరీక్ష సమయం మాత్రం గతంలో మాదిరిగా మూడు గంటలు చేయాలని నిర్ణయించింది.
మార్చి 8 నుంచి జేఎన్‌టీయూ పరిధిలో 2, 3, 4 సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కానున్నాయి. విద్యార్థులు కళాశాలలకు హాజరయ్యాక ల్యాబ్ వర్క్ పూర్తి
చేయించనున్నారు. 2020-21 సంవత్సరానికి మొదటి సెమిస్టర్
సిలబస్‌ను పూర్తి చేసి మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ‘‘ప్రస్తుతం తరగతి
గది బోధనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చిలో జరిగే పరీక్షలను గతంలో మాదిరిగా
మూడు గంటల పద్ధతిలోనే నిర్వహించేందుకు నిర్ణయించాం’ అని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్
మంజూర్ హుస్సేన్ తెలిపారు.
సొంతూరికి దగ్గర్లోనే పరీక్ష
కేంద్రం
ఫిబ్రవరి నెలాఖరుకు 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులు ల్యాబ్ వర్క్ పూర్తి చేసి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతారు. మొదటి ఏడాది విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో కొనసాగుతారు. విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లి తిరిగి కళాశాలలకు వచ్చి మార్చి 8 నుంచి పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సొంతూరుకు దగ్గర్లోని కళాశాలలో పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలని జేఎన్‌టీయూ అధికారులు నిర్ణయించారు.
0 Komentar