వ్యాక్సినేషన్.. ఈ రూల్స్
మర్చిపోవద్దు - రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి.. చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు రూల్‌బుక్ పంపించింది. 18ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొంది.
ఇవి గుర్తుంచుకోవాలి.
* కొవిడ్ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.
* యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్ టీకా ఇవ్వాలి.
* గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.
* కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
* టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
* టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో రేపటి నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తొలి రోజు 3
లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై
తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు
చేశారు. ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు
చేశారు.
0 Komentar