వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదేళ్ల సమీకృత పీజీ - మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
ఐదేళ్ల సమీకృత పోస్టు
గ్రాడ్యుయేషన్ (పీజీ), నాలుగేళ్ల సమీకృత బీఈడీ కోర్సులను వచ్చే
విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ
విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ
ఒక్క ఏడాదే ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా పీజీ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాం.
అభ్యాసన నిర్వాహక విధానాన్ని (ఎల్‌ఎంఎస్) అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీంతో
విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. ఉన్నత విద్యలో మార్పుల కోసం ప్లానింగ్
బోర్డు ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి వివరించారు. ‘వర్సిటీలు, ట్రిపుల్‌ఐటీలు, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో
ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. బెంగళూరుకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం
కుదుర్చుకున్నాం. పరిశోధనలను ప్రోత్సహించేందుకు జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో
మరో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, విజయనగరంలో గురజాడ, తిరుపతిలో నైపుణ్య వర్సిటీ
ఏర్పాటు చేయనున్నాం. ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం పంతులు వర్సిటీని పూర్తిగా
ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయంగా మార్పు చేయనున్నాం’ అని మంత్రి సురేష్
తెలిపారు.
0 Komentar