Indonesia: Sriwijaya Air plane
disappears from radar after taking off
ఇండోనేషియాలో విమానం అదృశ్యం
ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. జకార్తా నుంచి పోంటియానక్‌కు 62 మందితో బయల్దేరిన ఎయిర్ బోయింగ్ 737-500 శ్రీవిజయ విమానం ఆచూకీ గల్లంతైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. జకార్తా విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం గమనార్హం. ఈ బోయింగ్ విమానం జాడ కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్టు ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ పరస్పర సమన్వయం చేసుకుంటూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు.
విమానం కూలిపోయిందా?
మరోవైపు, ఈ
విమానం జావా సముద్రంలో కూలినట్టు అధికారులు భావిస్తున్నారు. థౌజండ్ ద్వీపాల్లో
విమాన శకలాలను జాలర్లు గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంటోంది. ఈ విమానం
అదృశ్యంపై సంబంధిత విమానయాన సంస్థ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. జకార్తా నుంచి
పోంటియానక్ వెళ్లేందుకు 90నిమిషాల సమయం పడుతుందని
పేర్కొంది. ఈ విమానంలో 56మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తంగా 62మంది ఉన్నట్టు
స్పష్టంచేసింది.
ఇండోనేషియాలోని పశ్చిమ కలిమంటన్ ప్రావిన్స్‌లోని పోంటియానక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737-500 విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. మరోవైపు, విమానం జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు శ్రీవిజయ విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ఈ విమానం ఇటీవలి సంవత్సరాల్లో రెండు ప్రమాదాలకు కారణమైన 737 మ్యాక్స్ బోయింగ్ రకం కాదు. 2018 అక్టోబర్ 29న ఇండోనేషియాలోని లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జకార్తాలో టేకాఫ్ అయిన 12 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో విషాదం నింపింది. ఇండోనేషియాలో రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కువ రద్దీకి తోడు మౌలిక వసతులు సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు.
0 Komentar