నీట్ రెండుసార్లు? - విద్యార్థుల నుంచి భారీగా వినతులు
కేంద్ర సర్కారు సానుకూల సంకేతాలు
దేశవ్యాప్తంగా వైద్యవిద్యకు సంబంధించిన ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి నీట్‌ను రెండు సార్లు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను రెండుసార్లు జరపాలని భారీ సంఖ్యలో విద్యార్థుల నుంచి ప్రతిపాదనలు కేంద్ర విద్యాశాఖకు అందాయి. అలా చేస్తే విద్యార్థులపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని నిపుణులూ భావిస్తున్నారు. విద్యార్థులు ఒకసారి పరీక్ష రాసే పరిస్థితుల్లో లేకున్నా.. తొలిసారి సరిగా రాయలేకున్నా రెండోసారి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని కేంద్రమూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండుసార్లు నీట్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఆమోదం తెలపాలని కోరుతూ ఇటీవల జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) కేంద్ర వైద్యశాఖకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో కచ్చితంగా రెండుసార్లు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
మార్పులు చేసేందుకే..
కేంద్రం నిర్వహించే పలు
ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించినా ఇప్పటి వరకు నీట్ తేదీని ప్రకటించలేదు.
వెంటనే ఆ తేదీని వెల్లడిస్తే సన్నద్ధ ప్రణాళిక రూపకల్పనకు వీలవుతుంది. ఇదే
విషయాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థులు కేంద్ర మంత్రికి, ఎన్‌టీఏ
అధికారులకు ట్విటర్ ద్వారా వినతులు పంపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి రెండు
వారాలలోపు నీట్ నిర్వహణ తేదీని వెల్లడించనున్నారు. అయితే.. రెండుసార్లు నిర్వహణ
తదితర కొన్ని మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం
దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో.. అదీ 11 భాషల్లో
ప్రశ్నపత్రాలు రూపొందించి నీట్ నిర్వహించడం కష్టమంటున్నారు. అందులోనూ రెండుసార్లు
నిర్వహించే సాహసం ఈసారి చేయకపోవచ్చని భావిస్తున్నారు. కాకపోతే మే నెలకు బదులు జూన్
లేదా జులైలో జరపవచ్చని అంచనా కడుతున్నారు.
0 Komentar