పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు - ఏజెన్సీ, మారుమూల పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చర్యలు
అందరూ పట్టణ, మైదాన
ప్రాంతాలకు తరలిపోకుండా కొన్ని పోస్టులు బ్లాక్
ఎనిమిదేళ్లు సర్వీసు నిండిన
గ్రామీణ ప్రాంత టీచర్లకు మేలు జరిగేలా ఏర్పాట్లు
పనితీరు పాయింట్ల ప్రాతిపదికన బదిలీలు
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండుగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల నమోదును ఇప్పటికే పూర్తిచేయించిన విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాటిని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. నిజానికి సంక్రాంతికి ముందే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలని ముందు భావించినప్పటికీ కొన్ని కారణాలవల్ల సెలవుల తర్వాతకు ఆ ప్రక్రియను వాయిదా వేశారు.
బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ
జాగ్రత్తలు..
ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి
విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా బదిలీల కారణంగా ఏజెన్సీ, మారుమూల
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది.
– టీచర్లలో ఒకే స్కూలులో 8 ఏళ్లు
సర్వీసు నిండిన వారికి, ప్రధానోపాధ్యాయుల్లో ఒకేచోట 5 ఏళ్లు
సర్వీసు పూర్తిచేసిన వారికి తప్పనిసరి బదిలీ నిబంధన పెట్టారు.
– ఇతరులలో ఒకేచోట కనీసం రెండేళ్లు
నిండిన వారికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు.
– రెండేళ్ల కన్నా తక్కువ సర్వీసు పూర్తిచేసిన వారికి కారణాలతో కూడిన అభ్యర్థన పూర్వక బదిలీ దరఖాస్తుకు వీలు కల్పించారు.
16వేల పోస్టులు బ్లాక్
మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా.. అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 16వేల పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేసింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పోస్టులను బ్లాక్ చేస్తున్న అంశాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డుల్లో ప్రదర్శించారు. పోస్టులు బ్లాక్ చేయకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూళ్లలో ఉన్న 10,198 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయే ప్రమాదముంది. దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశముండేది.
76వేల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
ఇదిలా ఉంటే.. 76,119 బదిలీలకు సంబంధించి దాదాపు అంతా బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కంపల్సరీ కేటగిరీలో 26,117 పోస్టులు, రిక్వెస్టు కేటగిరి కింద 50,002 ఖాళీ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా విద్యాశాఖ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అలాగే, వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల వారీగా సర్వర్లు విభజించారు.
పాయింట్ల ఆధారంగా బదిలీలు
ఉపాధ్యాయుల సర్వీసుతో పాటు వారి
పనితీరును కూడా బదిలీల్లో విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. వీటికి కొన్ని
పాయింట్లను కేటాంచింది. విడో, భార్యాభర్తలు, తీవ్ర
ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలా కొన్ని కేటగిరీల వారికి ప్రాధాన్యతనిస్తూ
అదనపు పాయింట్లు ఇచ్చింది. ఆ ప్రకారం పాయింట్ల మెరిట్ ప్రాతిపదికన బదిలీలు
చేయనున్నారు. ఈ ప్రక్రియ మేన్యువల్‌గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా
ఆటోమేటిగ్గా జరిగేలా కంప్యూటర్ జనరేటెడ్ బదిలీ ఉత్తర్వులు జారీచేయనున్నారు.
0 Komentar