TS: ఇంటర్ విద్యార్థులకు, మరింత ‘ఛాయిస్’ - వార్షిక
పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు
రాసేది తక్కువ జవాబులే..!
కరోనా దృష్ట్యా విద్యార్థులకు ఊరటనివ్వనున్న ఇంటర్ బోర్డు
ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో విద్యార్థులకు ఈసారి మరింత ఛాయిస్ పెరగనుంది. ప్రస్తుతం ఇంటర్‌లో అతి స్వల్ప జవాబు ప్రశ్నల్లో అసలే ఛాయిస్ లేదు. మిగిలిన స్వల్ప(షార్ట్), దీర్ఘ(లాంగ్) జవాబు ప్రశ్నల్లో కొంత ఛాయిస్ ఉంది. ఉదాహరణకు గణితం ప్రశ్నపత్రంలో మూడు భాగాలు ఉంటాయి. అందులో 2 మార్కుల అతి స్వల్ప జవాబు ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నిటికీ సమాధానాలు రాయాలి. ఇక 4 మార్కుల స్వల్ప జవాబు ప్రశ్నలు ఏడు ఇస్తే అయిదు, 7 మార్కుల దీర్ఘ జవాబు ప్రశ్నలు ఏడు ఇస్తే అయిదు రాయాలి. ఈ రెండింటిలో కూడా ఈసారి మరింత ఛాయిస్ పెంచనున్నారు. అంటే 10 వరకు ప్రశ్నలు ఇస్తే అందులో అయిదింటికి మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చని సమాచారం. ఇతర సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ కూడా ఇదే తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దాని వల్ల విద్యార్థులకు మరింత వెసులుబాటు ఇచ్చినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయని ఓ అధికారి తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలను
ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబరు 1
నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినందున మార్చి నెలాఖరు వరకు సిలబస్
పూర్తవుతుందని చెబుతున్నారు. పరీక్షల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం
తీసుకోవాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పరీక్ష ఫీజు
వసూలుకు సంబంధించిన కాలపట్టికను జారీ చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు కలిపి దాదాపు 9.50 లక్షల మంది
పరీక్షలు రాయనున్నారు. జనవరి 18వ తేదీ నుంచి జూనియర్
కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే, తరగతులను షిఫ్టు పద్ధతిలో నిర్వహించాలా? రోజు తరవాత రోజు నిర్వహించాలా? అన్న అంశంపై
ప్రభుత్వానికి ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపింది. హాస్టళ్ల నిర్వహణ అంశంపైనా
ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
0 Komentar