TS: పాఠశాలలు నడిచేది 65 - 70 రోజులే - ఆన్‌లైన్ విధానం ఎంచుకునే స్వేచ్ఛ
‣ విద్యార్థుల
హాజరుకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి
‣ తరగతి
గదికి గరిష్ఠంగా 20 మంది
‣ 9, 10 తరగతుల వారికి మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం (2020-21)లో కేవలం 65-70 రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. పాఠశాలలను ఏప్రిల్ వరకే నడిపి, మే నెలలో పదో తరగతి పరీక్షలు జరపాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ విద్యాసంస్థలను నడపనున్నారు. భౌతికదూరం తప్పనిసరి కనుక, ఒక్కో గదికి గరిష్ఠంగా 20 మందికి మించి విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు బడికి రావాలంటే తల్లిదండ్రుల లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరి. బడికి పంపడానికి ఇష్టపడకుంటే ఆన్‌లైన్ విధానంలో చదువుకునేలా ఆప్షన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఏప్రిల్ నెలాఖరు వరకే తరగతులు
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు కలిపి మొత్తం 89 రోజులు. వాటిల్లో ఆదివారాలు, సెలవులు తీసివేస్తే మిగిలేది 70 రోజులే. రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేస్తాయని చెబుతున్నారు. జాతీయ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు- ఇంటర్ పరీక్షలతో ముడిపడి ఉన్నందున ఆ పరీక్షలను ఏప్రిల్ నెలాఖరులోనే ప్రారంభిస్తారు. విద్యార్థులు మే 24 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. 11 పరీక్షలకు బదులు ఆరు పరీక్షలే జరిపే ఆలోచనలో అధికారులున్నారు. 6, 7, 8 తరగతుల గురించి ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
ఇవీ నిబంధనలు.. ప్రణాళిక
* విద్యార్థులు ఎక్కువ,
సౌకర్యాలు తక్కువగా ఉంటే షిఫ్టు విధానంలో కూడా పాఠశాలలను నడిపే
అవకాశం ఇస్తారు. ఉదయం పదో తరగతి, మధ్యాహ్నం తొమ్మిదో తరగతి
జరుపుకోవచ్చు. ఆరుబయట కూడా తరగతులు నిర్వహించుకోవచ్చని ఒక అధికారి చెప్పారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు నుంచే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తారు.
0 Komentar