TS: జనవరి 20లోగా విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పూర్తి - డీపీవో, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించిన ప్రభుత్వం
రాష్ట్రంలో పాఠశాలలు, గురుకులాల్లో శానిటైజేషన్ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిశుభ్రం చేసి జనవరి నెల 20లోగా సిద్ధం చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని తెలిపింది. జిల్లాస్థాయి విద్య పర్యవేక్షణ కమిటీల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో కీలకమైన డీపీవో, మున్సిపల్ కమిషనర్లను సభ్యులుగా చేర్చింది. తొమ్మిది ఆపై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి విద్యాసంస్థలు మూతబడ్డాయి. కొన్నిచోట్ల విద్యాలయాలు క్వారంటైన్ కేంద్రాలుగా సేవలందించాయి. కరోనా కేసులు తగ్గడంతో అక్కడి నుంచి క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం గతంలోనే తొలగించింది. పాఠశాలలు తెరవనుండటంతో పరిశుభ్రత కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం సూచించింది. తరచూ శానిటైజేషన్ ప్రక్రియ, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ పర్యవేక్షించాలని సూచించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు అన్ని గదులు, బెంచీలు, డెస్క్‌లను రసాయనిక శుద్ధీకరణ చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత కొలిచేందుకు డిజిటల్ థర్మామీటర్లు, శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో పెట్టాలని, ప్రతిరోజూ విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి పరిశీలించి, పర్యవేక్షించాలని సూచించింది. ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులను తీసుకువచ్చే బస్సులను కూడా ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని ఆదేశించింది.
0 Komentar